దసరా.. తెలుగువారంతా ఎంతో వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండుగలో ఇది ఒకటి. అందుకే, దసరానాడు ఏదైనా కొత్త వస్తువు కొనాలని, వైభవంగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగను జరుపుకోవాలని అందరూ భావిస్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంగతి చెప్పేదేమీ లేదు. అందులో ఈసారి దసరా ఐదో తారీకున రావడంతో ఒకటో తారీకు జీతాలు వస్తాయి కాబట్టి ఈసారి దసరా పండుగనాడు నిజంగానే పండగ చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు భావించారు.
అయితే, ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంది. నాలుగో తారీకునాటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు జమ కాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం పడినట్టుగా మెసేజ్ ఎప్పుడు వస్తుందోనని సెల్ ఫోన్ వైపు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. పండగకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పండుగ మూడ్ లోకి వెళ్ళలేకపోతున్నారు.
ఈ సమస్య ఒకరితో ఇద్దరిదో కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు…అందరిదీ. సోమవారం అర్ధరాత్రి నాటికి ఈ 14 లక్షల మందిలో కేవలం పాతిక శాతం మందికి మాత్రమే జీతాలు పడ్డాయి. మిగతా 75% జీతాలు ఒక్కరోజులో పడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రతినెల 3700 కోట్లు చెల్లించాల్సిన ప్రభుత్వం…ఖజానా నిండుకోవడంతో వెయ్యి కోట్లు మాత్రమే చెల్లించిందని తెలుస్తోంది.
5వ తారీకు ఇంటి అద్దెలు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల నుండి తీసుకున్న ఈఎంఐలకు కట్ ఆఫ్ డేట్ 5వ తారీకు కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి కూడా అమ్మో ఒకటో తారీకు అనేలా పరిస్థితి తయారైందని అంటున్నారు. ఈరోజు జీతాలు పడకపోతే పండగ రోజు కూడా పచ్చడి మెతుకులు తప్పవని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.