ఏపీ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయా? ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. పీఆర్సీ నివేదిక విషయంలో కొన్నాళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు.. ఇప్పుడు ఏకంగా.. సచివాలయం రెండో బ్లాక్లో బైఠాయించారు.
తక్షణమే పీఆర్ సీ నివేదికను బయట పెట్టాలని.. వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అమరావతి జేఏసీ, ఏపీ ఉద్యోగ జేఏసీ సహా పలు ఉద్యోగ సంఘాల నాయకులు.. అదికారుల తీరుపై మండిపడుతున్నారు.
దాదాపు ఏడాదిన్నరగా పీఆర్సీ విషయం రాష్ట్రంలో నానుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఏ ప్రభుత్వా నికి సహకరించని విధంగా జగన్ సర్కారుకు ఏపీ ఉద్యోగులు ఎంతో సహకరించారు. స్థానిక ఎన్నికల విష యంలోనూ.. తర్వాత.. కూడా ప్రభుత్వానికి ఉద్యోగులు.. సహకరించారు.
అయితే.. ఇప్పుడు.. పీఆర్సీ సహా.. ఇంక్రిమెంట్లకు సంబంధించి గతంలో అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదికను.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. తన వద్దే పెట్టుకున్నారనేది ఉద్యోగ సంఘాల నాయకుల ఆరోపణ. గత నెల 29న జరిగిన సమావేశంలోనూ.. త్వరలోనే ఈ నివేదికను బయట పెడతామని హామీ ఇచ్చారని.. కానీ.. ఇప్పటి వరకు.. దీనిని బయట పెట్టలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనూహ్యంగా బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఏపీ జేఏసీ. ఏపీ జేఏసీ అమరావతి.. సహా.. అన్ని సంఘాల నాయకులు.. ఉద్యోగులతో కలిసి.. సచివాలయం రెండో బ్లాక్ ఎదురు గా బైఠాయించారు. తక్షణమే ఈ విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని .. తమ కు పీఆర్ సీ నివే దికను అందించడంతోపాటు.. తమ నుంచి కూడా రిపోర్టును తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
అయితే.. ఈ పరిణామం.. సీరియస్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని తక్షణం రెండో బ్లాక్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. కానీ, ఉద్యోగులు ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో పీఆర్ సీ పేచీ ఏమలుపు తిరుగుతుందో చూడాలి.