5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ 5 రాష్ట్రాలతోపాటు ఏపీ లో ఎన్నికల షెడ్యూల్ కూడా ఈ రోజే వెలువడనుందని పుకార్లు వచ్చాయి. సడెన్ గా ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రకటన వస్తుందని, ఢిల్లీలో అమిత్ షాతో జగన్ ఇదే విషయంపై మాట్లాడి వచ్చారని ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ పుకార్లకు తెరదించుతూ ఏపీలో ఎన్నికలపై సీఎం జగన్ స్పష్టతనిచ్చారు.
2024 ఫిబ్రవరిలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, మార్చిలో ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగుతాయని జగన్ క్లారిటీనిచ్చారు. విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ ఈ కామెంట్లు చేశారు.
అక్టోబరు 25 నుంచి డిసెంబర్ 21 వరకు బస్సు యాత్ర చేపట్టబోతున్నానని, ప్రతిరోజు మూడు సమావేశాలుంటాయని, బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నేతలుంటారని అన్నారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. తనకు చంద్రబాబుపై కక్ష లేదని, చట్ట ప్రకారమే ఆయనను అరెస్టు చేసి విచారణ జరిపి రిమాండుకు తరలించారని అన్నారు.
చంద్రబాబు అరెస్టు అక్రమమైతే జనసేన మిత్రపక్షంగా ఉన్న కేంద్రంలోని బీజేపీ స్పందించి ఉండేదని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని, కానీ, తన పొత్తు ప్రజలతో అని జగన్ చెప్పారు. పార్టీ పెట్టి 15 ఏళ్లయినా పవన్ నియోజకవర్గ స్థాయి నేతలను తయారు చేసుకోలేకపోయారని విమర్శించారు.