ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలన పరంగా మెరుపులు మెరిపిస్తున్నారు. ప్రమాణం చేసిన పది రోజుల్లో ఆయన పాలన పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూనే.. ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చారు. తాజాగా శనివారం ఉదయం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన పాలన పరంగా అందరూ తమను గమనిస్తున్నారని.. అసెంబ్లీలో అవాకులు చవాకులకు అవకాశం లేకుండా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. గత వైసీపీ సభలా కాకుండా.. ఉన్నత స్థాయిలో సభ ఆదర్శంగా మారాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇది పాలన పరంగా అందరికీ ఆయన చేసిన దిశానిర్దేశం.
ఇక, శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత.. అక్కడే భోజనం చేసిన పవన్ కల్యాణ్.. అసెంబ్లీ నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. అయితే.. ఆయన కారు కార్యాలయం ముందుకు చేరే లోపే.. అనేక మంది అక్కడ వేచి ఉన్నారు. అయితే..వారంతా తన అభిమానులని.. తనను అభినందించేందుకు వచ్చారని పవన్ భావించారు. కానీ, వాస్తవం ఏంటంటే.. వారంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు. తమ సమస్యలు చెప్పుకొనేందుకు పవన్ కల్యాణ్ కోసం గంటల తరబడి ఎండలో వేచి ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే.. పవన్ కారు నుంచి బయటకు దిగి.. అప్పటికప్పుడు టెంట్లువేయించారు.
అంతేకాదు.. తాను కూడా లోపలకు వెళ్లకుండానే అక్కడే కుర్చీలు వేయించారు. వచ్చిన వారికి తాగునీరు, టీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం.. తాను కూడా వారితో కలిసి అక్కడే కూర్చుని.. బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నా రు. కొన్ని అర్జీలకి సంబంధించి అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. బాధితులు ఇచ్చిన ప్రతి అర్జీనీ తానే స్వయంగా చదవి.. పెన్నుతో అండర్ లైన్ చేయడం గమనార్హం. అంతేకాదు.. వాటిని ఏ విభాగంలో అందించాలో.. తన సిబ్బందికి సూచించారు. కొందరు ఫోన్ నెంబరు వేయడం లేదని గుర్తించిన ఆయన వారిని అడిగి ఫోన్ నెంబరు తీసుకున్నారు. త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ఫోన్లు వస్తాయని.. సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు.