ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని మాట మార్చి చెప్పి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై విమర్శలు పెరుగుతున్నాయి. టీడీపీ, బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్ల పని, దుండుగల పని అని మొన్న చెప్పి… ఈరోజు రాజకీయ పార్టీలకు దానిని అంటగడతారా? ఒకవైపు పాస్టర్ ప్రవీణ్ అనే వైసీపీ మంత్రి సన్నిహితుడిని అరెస్టు చేసి ఇంకోవైపు టీడీపీ బీజేపీల మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తారా అంటూ బీజేపీ – టీడీపీలు ధ్వజమెత్తాయి.
డీజీపీ ఇప్పుడు మాట మార్చి దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని అంటున్నారు. ఒక డీజీపీ ఎలాంటి వివరాలు లేకుండా ఇలా ఫేక్ గా మాట్లాడవచ్చా? తాడేపల్లిలో జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ ను చదవడమే డీజీపీ పని.
- టీడీపీ నేత బండారు సత్యనారాయణ
విగ్రహాలను ధ్వంసం చేయడంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని ఏ సమాచారంతో డీజీపీ చెప్పారు. సీఐడీ, సిట్ ఇచ్చిన సమాచారంతో చెప్పారా? లేక సజ్జల ఇచ్చిన సమాచారంతో చెప్పారా? 13వ తేదీన మాట్లాడుతూ ఈ అంశంతో ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పిన డీజీపీ… ఇప్పుడు పార్టీలకు సంబంధం ఉందని చెపుతున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. డీజీపీకి హైందవ మతాన్ని కించపరుస్తూ మాట్లాడిన కొడాలి నాని నేరస్తుడిలా కనిపించలేదా?
- టీడీపీ నేత వర్ల రామయ్య
ఆలయాలపై దాడుల వెనుక బీజేపీ, టీడీపీ కుట్ర ఉందని డీజీపీ ఎలా చెపుతారు. ఒక వైసీపీ నేత మాదిరి డీజీపీ వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం సిగ్గు లేకుండా డీజీపీ మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలపై పోలీసులు చేస్తున్న దాడులు పిరికిపంద చర్య.
- బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్