ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో గత నెల 23న నిర్వహించిన గ్రామ సభల కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. ఒకే రోజు 13,326 గ్రామాల్లో `స్వర్ణ గ్రామ పంచాయతీ` పేరుతో గ్రామ సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు కూడా కోనసీమలోని ఓ గ్రామంలో నిర్వహించిన సభ లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు. ఇలా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి.. పలు తీర్మానాలు చేశారు.
అయితే.. ఇలా.. గ్రామాలకు ఊపిరులూదేలా ఒకే రోజు ఇన్ని వేల గ్రామాల్లో సభలు నిర్వహించిన హిస్టరీ ఇప్పటి వరకు లేకపోవ డంతో ఇది ప్రపంచ రికార్డుగా మారింది. ఈ నేపథ్యంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఈ విషయాన్ని గుర్తించింది. ఒకే రోజు ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద `గ్రామ పాలన`గా పేర్కొంది. ఈ క్రమంలో `స్వర్ణ గ్రామ సభల`ను తమ రికార్డుల్లో నమోదు చేసింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్, మెడల్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు యూనియన్ ప్రతినిధి అందించారు. ఈ సందర్భంగా పవన్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ.. “గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉంది“ అని పేర్కొన్నారు. అనుకున్న విధంగా ఈ గ్రామసభలు విజయవంతం చేయడంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేశారని తెలిపారు. గ్రామసభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు తన ప్రయత్నాలు ఇలానే సఫలం అవుతామని ఆశిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు.
ఆ రోజు ఏం జరిగింది?
+ మాజీ ప్రధాని పీవీ నేతృత్వంలో ఆగస్టు 23న పంచాయతీ రాజ్ చట్టానికి కొన్నిసవరణలు జరిగి.. పంచాయతీలు బలోపేతం అయ్యాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పవన్ స్వర్ణ గ్రామ సభలను నిర్వహించాలని తలపోశారు.
+ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పగానే.. ఆయన ఓకే చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామాల్లో సభలు నిర్వహించారు.
+ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనులు, వివిధ పథకాలు ఉపయోగించుకొని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలో సాగాలన్నదానిపై చర్చించారు. రూ.4,500 కోట్ల పనులను ఆమోదించారు.
+ 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మందికి ఉపాధి లభించనుంది.
+ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు మార్గం సుగమమైంది.