తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతోపాటు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం నాడు తిరుమలలో పవన్ దీక్షను విరమించారు. అయితే, మంగళవారం నాడు తిరుమలకు అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకున్న పవన్ ఆ తర్వాత కాస్త అస్వస్థతకు గురయ్యారు. పవన్ తీవ్ర జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్నారు. పవన్ కు తిరుమలలోని అతిథి గృహంలో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ రోజు సాయంత్రం తిరుపతిలో చేపట్టదలచిన వారాహి సభలో పవన్ పాల్గొంటారా లేదా అన్న సందిగద్దత ఏర్పడింది. వారాహి డిక్లరేషన్ పై ఈ రోజు పవన్ ప్రసంగించాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ సభలో పవన్ పాల్గొంటారని జనసేన శ్రేణులు అధికారికంగా వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు తిరుపతి జ్యోతిరావ్ పూలే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ పాల్గొంటున్న తొలి బహిరంగ సభ కావడం, వారాహి డిక్లరేషన్ ప్రకటన నేపథ్యంలో ఈ సభకు వేలాదిగా జనసైనికులు తరలివస్తారని అంచనా.
వారాహి డిక్లరేషన్ లో ఏఏ అంశాలు ఉండబోతున్నాయి? ప్రజలకు, జనసైనికులకు పవన్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఇక, తిరుపతి లడ్డూ వ్యవహారంపై పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకోవడం, సనాతన ధర్మం పరిరక్షణ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో ఈ సభలో వాటి ప్రస్తావన ఎలా ఉండబోతోంది అన్న విషయం చర్చనీయాంశమైంది.
కాగా, ప్రజా యుద్ధనౌక గద్దర్‌ను గుర్తుచేసుకుంటూ ఓ పాత వీడియోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. “ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నని స్మరించుకుంటూ… సనాతన ధర్మాన్ని గౌరవించే నా గద్దరన్నకి నమస్సుమాంజలి..” అని ట్వీట్ చేశారు. దీనికి ఓ పాత వీడియోను జోడించారు. అలాగే యాదాద్రి ఆలయం ఎదుట గద్దర్ మోకరిల్లి వందనం చేసిన, ఆసుపత్రిలో చేరిన గద్దర్‌ను ఆయన పరామర్శించి హత్తుకున్న ఫొటోలను జనసేనాని పంచుకున్నారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.