జగన్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రామ పంచాయతీలకు పునరుజ్జీవం కల్పించేలా చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
కంకిపాడులో రూ. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంట్ రోడ్లు, రూ. 4.15 లక్షలతో నిర్మించే రెండు గోకులాలు, పునాదిపాడులో రూ. 54 లక్షలతో నిర్మించే రెండు రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవం ఏపీకి అవసరమని పవన్ అన్నారు. చంద్రబాబు వంటి నాయకుడి అనుభవాన్ని వాడుకోకపోతే తప్పు చేసినవాళ్లమవుతామని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆ కారణంతోనే టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి పోటీ చేశామని చెప్పారు. ఎన్నో దెబ్బలు తిన్నా తట్టుకుని నిలబడ్డామని చెప్పారు. పరిపాలనలో చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శించడం తనకు ఇష్టం ఉండదన్నారు.