ప్రధాని మోదీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ టూర్ లో ఉన్న పవన్.. మోదీతో గంట పాటు భేటీ అయిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో తీరిక లేనప్పపటికీ విలువైన సమయం తన కోసం మోదీ కేటాయించారని పవన్ అన్నారు. మోదీని కలిసిన ప్రతిసారీ తాను స్ఫూర్తి పొందుతానని, దేశంపై ఆయనకు ఉన్న ప్రేమ, అంకిత భావం తనకు ఎంతో ఇష్టమని అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై ప్రణాళికలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లపై మోదీతో చర్చించానని, దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని అన్నారు.
అదానీతో జగన్ సర్కార్ సోలార్ విద్యుత్ ఒప్పందాలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని, ఆ తర్వాత చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని పవన్ అన్నారు. జగన్ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని, అదానీతో ఒప్పందం విషయంలో మరింత సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ఇక, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో భేటీ అయిన పవన్ ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగిల్ విండో విధానానికి మార్చాలని కోరారు. అదానీ వ్యవహారంపై కూడా మోదీతో పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.