తిరుపతిలో పద్మావతి పార్కు దగ్గర ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఘటనా స్థలాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా చనిపోయిన భక్తుల కుటుంబాలకు, గాయపడ్డ భక్తులకు, తొక్కిసలాటలో తీవ్ర అసౌకర్యానికి గురైన భక్తులకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తిరుపతి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని పవన్ అన్నారు. తప్పు జరిగిపోయిందని, తమను క్షమించాలని పవన్ వేడుకున్నారు
ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు కనిపిస్తోందని పవన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అభిమానులు పవన్ ను చూసి కేకలు పెట్టి చేతులు ఊపారు. దీంతో, పవన్ అసహనానికి గురయ్యారు. ‘‘ఇది ఆనందించే సమయమా… బాధ అనిపించడం లేదా మీకెవ్వరికీ!… మనుషులు చచ్చిపోయారు… మనుషులు చచ్చిపోయారు అంటూ పదే పదే గట్టిగా అరిచారు. పోలీసులు ఏం చేస్తున్నారు… జనాన్ని కంట్రోల్ చేయండి… బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించవద్దు’’ అని పవన్ అసహనం వ్యక్తం చేస్తూ సీరియస్ అయ్యారు.
ఇక, ఆ తర్వాత కాసేపటికి పవన్ ప్రసంగం సమయంలో మరోసారి కేకలతో ఆసుపత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. ప్రసంగం ఆపి పక్కనే ఉన్న జనసేన నేతను ఏంటని పవన్ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చారు సార్ అని చెప్పడంతో పవన్ తన ప్రసంగం కొనసాగించారు. స్విమ్స్ లో తొక్కిసలాట బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు.