గతంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ పై చర్యల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. సునీల్ పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డికి జవహర్ రెడ్డి లేఖ రాశారు. అంతేకాదు, ఆయనపై తీసుకున్న చర్యల గురించి తనకు నివేదిక పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23న జవహర్ రెడ్డి రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తుంగలో తొక్కి నోటీసులు ఇవ్వకుండా అమాయకులను సునీల్ అరెస్టు చేస్తున్నారని, కస్టడీలో చిత్రవధ చేస్తున్నారని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గతంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ విషయాన్ని జడ్జిల ముందు చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. సోషల్ మీడియా కేసులు సీఐడీ పరిధిలోకి రాకపోయినా వాటిని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిన హింసిస్తున్నారని ఆరోపించారు.
ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో సీఐడీ మాజీ డీజీ సునీల్‌కుమార్ కు ఇటీవల షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రఘురామ ఫోన్ తీసుకున్న సునీల్ కుమార్…వేరే వ్యక్తులకు మెసేజ్ లు పంపించారని, కస్టడీలో తనను కొట్టారని గతంలో ఫిర్యాదు చేశారు. హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నసునీల్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డీఓపీటీ శాఖకు గతంలోనే లేఖ రాశారు. ఈ క్రమంలోనే సునీల్ కుమార్‌పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఇటీవల ఏపీ సీఎస్ కు డీఓపీటీ నుంచి లేఖ అందింది.
ఇక, అక్రమ అరెస్టుల నేపథ్యంలో సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సిఎస్ కు కేంద్ర హోంశాఖ కొద్ది రోజుల క్రిత రాసిన లేఖ పెను దుమారం రేపుతోంది. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖకు గూడపాటి లక్ష్మీనారాయణ గతంలో ఫిర్యాదు చేశారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలువురిపై సునీల్ కుమార్ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. దీంతో, సునీల్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీకి జవహర్ రెడ్డి రాసిన లేఖ తాజాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.