రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ.. రోజుకు పదుల సంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్నప్పటికీ.. కరోనా బాధితులకు సరైన వైద్యం అందక, ఆసుపత్రుల్ల బెడ్లు నిండిపోయి.. గగ్గోలు పెడుతున్నా.. ఇంటర్ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తగ్గడం లేదు. ఆయన వైఖరి చూస్తుంటే.. “తాంబూలాలిచ్చేశాను.. తన్నుకు చావండి“-అన్నట్టుగానే ఉంది. మే 5వ తారీకు నుంచి రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షలు నిర్వహించి తీరుతామని పదే పదే చెబుతున్నారు. ఇతర రాష్ట్రాలు ఎక్కడా ఆపలేదు కనుక మేం కూడా ఆపేది లేదని అంటున్నారు.
మరోవైపు ప్రతిపక్షాలు.. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, కామ్రేడ్లు కూడా ఇంత విపత్కర పరిస్థితిలో పరీక్షలేంటి నాయనా! రద్దు చేసేయ్!! అని డిమాండ్లు చేస్తున్నా.. జగన్ తూ.చ. తప్పకుండా తన పంతాన్నే కొనసాగి స్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయా పార్టీలు సహా స్వచ్ఛందంగా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. అయితే.. ఇన్ని రూపాల్లో.. ఇంతగా డిమాండ్ చేస్తున్నా.. సీఎం జగన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఆయన పంతానికి పోతున్నారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? అంటే.. పంతంకన్నా రెండు కీలక కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
వీటిలో ఒకటి.. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు పదుల సంఖ్యలో బాధితులు చనిపోతుననారు. అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం `ఆ.. ఏమీ లేదు. అంతా బాగానే ఉంది!` అనే సందేశాన్నే ప్రజల్లోకి పంపుతోంది. అంతేకాదు.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా తాము మానిటరింగ్ చేస్తున్నామని.. సో.. రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితి అయితే లేదని స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. అన్ని ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్నామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తే.. లేదా రద్దు చేస్తే.. ప్రభుత్వం చెబుతున్న వన్నీ.. ఫాల్స్ అనే ప్రచారం ఊపందుకుంటుంది.
అంటే.. ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారంటే.. కరోనా తీవ్రంగా ఉందనే కదా? కరోనా విషయంలో తాము చూస్తూ ఉన్నాం.. అది విజృంభించేసింది.. అనే సంకేతాలు ఇచ్చినట్టే కదా..! అందుకే ఇంటర్ పరీక్షలను వాయిదా వేయడానికి ఇష్టపడడం లేదు. అదేసమయంలో ఇప్పుడు ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే.. కరోనాపై తాము సమర్ధవంతంగా పనిచేశామని.. అనేక చర్యలు తీసుకుని కట్టడి చేశామని రేపు చెప్పుకొనేందుకు ప్రభుత్వ పెద్దలకు అవకాశం ఉండదు.
ఒకవేళ.. ఓ రెండు మాసాల తర్వాత చెప్పుకొన్నా.. అంత కట్టడి చేస్తే.. ఇంటర్ పరీక్షలు ఎందుకు వాయిదా వేశారు.. లేదా రద్దు చేశారు? అని ప్రతిపక్షాలు నిలదీసే అవకాశం ఉంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా తమ ప్రభుత్వం కరోనా విషయంలో వెనుకబడలేదనే సంకేతాలు ఇచ్చేందుకు ఇంటర్ పరీక్షలను కొంత పంతం .. మరికొంత ప్రతిష్టాత్మకం కలబోసి.. నిర్వహించేందుకు రెడీ అయ్యారని.. అంటున్నారు పరిశీలకులు. ఇక, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టే మున్ముందు పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.