మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయని మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కొద్ది రోజుల క్రితం ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే 86 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో ఉన్న రామోజీరావును అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సిఐడి అధికారులు విచారణ జరిపిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసులో సీఐడీ రామోజీరావును ఏ-1గా, శైలజా కిరణ్ ను ఏ-2గా సీఐడీ పేర్కొంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కోడలు శైలజా కిరణ్ ను కూడా సీఐడీ అధికారులు నేడు ప్రశ్నిస్తున్నారు.
జూబ్లీహిల్స్ లోనే రామోజీరావు నివాసంలో శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. రామోజీ గ్రూపునకు చెందిన ఇతర కంపెనీలకు చిట్ ఫండ్ నిధులను మళ్లించినట్లు సిఐడి అధికారులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్గదర్శికి చెందిన 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొద్దిరోజుల క్రితం సిఐడి అధికారులు అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు అమెరికాలో ఉన్న శైలజా కిరణ్ కు సిఐడి అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, రామోజీరావు టార్గెట్ గా మరోసారి ఏపీ సర్కార్ పావులు కదుపుతోంది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నుంచి రూ.793 కోట్ల నగదును అటాచ్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం జీవో జారీ చేయడం సంచలనం రేపింది. చిట్ ఫండ్ చట్టాన్ని అతిక్రమించి నిధులను దారి మళ్లించారని రామోజీరావు, శైలజా కిరణ్ తదితరులపై ఆరోపణలు రావడంతో సీఐడీ విచారణ చేపట్టింది. చిట్స్ ద్వారా వసూలైన డబ్బును స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కు బదలాయించడం వంటి ఆరోపణలున్నాయి. తాజా పరిణామంపై రామోజీరావు స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.