జగన్ పాలనలో వైసీపీ నేతగా మారిన పోసాని కృష్ణ మురళి నోటికి అడ్డూ అదుపు లేకుండా ప్రత్యర్థి పార్టీల నేతలుపై దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లపై దూషణలకు దిగడం, బూతులు తిట్టడం నిత్యకృత్యంగా మారింది. దీంతో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల పోసానిపై కేసులు నమోదయ్యాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని చేసిన వ్యాఖ్యలపై కూడా కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా పోసానిపై ఏపీ సీఐడీ పోలీసులు కూడా కేసు నమోదు చేయడంతో ఆయనకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.
2 నెలల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో…అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సీఎం చంద్రబాబుపై పోసాని అసభ్యకర రీతిలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో, పోసానిపై రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరచడంతోపాటు, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యానించిన పోసానిపై చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసానిపై సెక్షన్ 111, 196, 353, 299, 336 (3) (4), 341, 61(2) బీఎస్ఎస్ ప్రకారం సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.