వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంలో ఏపీ సీబీసీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. రఘురామ ఫోన్ ను సునీల్ కుమార్ తీసుకున్నారని, అందులోనుంచి వేరే వ్యక్తులకు మెసేజ్ లు పంపించారని రఘురామ ఆరోపిస్తూ ఫిర్యాదు కూడా చేశారు. దీంతోపాటు, హిందూ మత వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో రఘురామ గతంలోనే ఫిర్యాదు చేశారు.
సునీల్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీఓపీటీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు ఆర్ఆర్ఆర్ లేఖ కూడా రాశారు. దీంతో, సునీల్‌కుమార్‌పై హోంశాఖ నిర్ణయం తీసుకోవాలని ఆ శాఖ కార్యదర్శికి రఘురామ ఇచ్చిన ఫిర్యాదును జత చేస్తూ జితేంద్ర సింగ్ లేఖ రాశారు. హోంశాఖ కార్యదర్శికి పంపిన లేఖ కాపీని రఘురామకు కూడా జితేంద్ర సింగ్ పంపించారు. ఈ క్రమంలోనే సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా హిందూ మత వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌పై హోం శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అంతా ఎదురు చూశారు. కానీ, సునీల్ పై చర్యలు తీసుకోకపోగా..తాజాగా సునీల్ కు ప్రమోషన్ కల్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
డీజీపీ హోదాతో పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ హోదాతో సీఐడీ చీఫ్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడాయనకు డీజీపీగా ప్రమోషన్ ఇచ్చారు. పదోన్నతి 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వివరించారు. దీంతో, ఈ వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. పలు ఆరోపణలు ఎదుర్కొంటోన్న సునీల్ కు ప్రమోషన్ రావడం వెనుక జగన్ ఉన్నారని అంటున్నారు. జగన్ చెప్పిన పని తు.చ తప్పకుండా పాటించిన సునీల్ కు తగిన ప్రతిఫలం లభించిందని అనుకుంటున్నారు.