సీఎం జగన్ పై ఆయన బావ, మత బోధకుడు బ్రదర్ అనిల్ కొద్ది రోజులుగా అసమ్మతి రాగం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో క్రిస్టియన్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న బ్రదర్ అనిల్…కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ గెలుపు కోసం పని చేసిన బీసీ, క్రిస్టియన్, మైనారిటీ వర్గాలు తమకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఉన్నారని, వారి బాధలు వినేందుకు తాను సమావేశాలు పెడుతున్నానని బ్రదర్ అనిల్ చెబుతున్నారు.
అంతేకాదు, బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తోందని, దీన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని కూడా బ్రదర్ అనిల్ చేసిన కామెంట్లు కాక రేపాయి. ఇక, ఏపీలో బర్నింగ్ టాపిక్ అయిన వివేకా మర్డర్ మిస్టరీపై కూడా బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని, సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తోందని ఆయన చెప్పారు. ఇలా కొంతకాలంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న బ్రదర్ అనిల్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్ తాజాగా విమర్శలు గుప్పించారు.
దైవ సందేశాన్ని అందించే బ్రదర్ అనిల్ రాజకీయ అవతారాన్ని ఎప్పుడెత్తారో చెప్పాలని ప్రవీణ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలని, ఏపీ రాజకీయాల్లో తల దూర్చవద్దని బ్రదర్ అనిల్ కు ప్రవీణ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరిస్తానని అగ్ర కులానికి చెందిన బ్రదర్ అనిల్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
కేఏ పాల్ పతనం తర్వాత… బ్రదర్ అనిల్ ను వైయస్ రాజశేఖరరెడ్డి ప్రపంచానికి శాంతిదూతగా పరిచయం చేశారని, అటువంటి అనిల్ ఏపీ రాజకీయాల్లో తల దూర్చవద్దని హెచ్చరించారు. మరి, ఈ వ్యాఖ్యలపై బ్రదర్ అనిల్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రవీణ్ వ్యాఖ్యల వెనుక వైసీపీ నేతలున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జగన్ పై ఆయా సంఘాలకున్న అసంతృప్తిని బట్టబయలు చేస్తున్నారన్న కారణంతోనే బ్రదర్ అనిల్ నోరు మూయిస్తున్నారన్న టాక్ వస్తోంది.