- తొలుత 2,995 కోట్ల అప్పుతెచ్చే యోచన
- మనుగడలో లేని ఏఎంఆర్డీఏ ద్వారా రుణం
- అమరావతిని నిర్వీర్యం చేసే ప్రణాళిక
- అప్పుల కోసమే 3 రాజధానుల బిల్లు వెనక్కి
- తాజాగా రాజధాని గ్రామాల్లో చీలికకు కుట్ర
- 19 గ్రామాల్లో కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్
- అంగీకరించేది లేదని గ్రామసభల్లో తెగేసి చెప్పిన ప్రజలు
రాజధాని అమరావతిపై జగన్ సర్కారు కుట్రలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా బహిర్గతమైంది. అమరావతి పరిధిలోని భూములను, భవనాలను తెగనమ్మి దానిని నిర్వీర్యం చేయాలన్న కుట్ర బయటపడింది.
ఇదే సమయంలో సంఘటితంగా ఉద్యమిస్తున్న 29 రాజధాని గ్రామాల రైతులు, మహిళల్లో చీలిక తెచ్చేందుకు మరో పథకం వేసింది. అందులో 19 గ్రామాలను మాత్రమే అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
జగన్ ప్రభుత్వానికి ఫస్టాఫ్ ముగిసి సెకండాఫ్ స్టార్ట్ అయింది. మొదటి రెండున్నరేళ్లలో ప్రభుత్వానికి ఉన్న ఆస్తులు.. వాటిని ఎలా అమ్మాలో ప్లాన్ చేసుకోవడానికి సరిపోయింది. సెకండాఫ్ మొదలవగానే రాష్ట్రంలో అందరి దృష్టినీ సినిమా టికెట్ల ధరలపైకి మళ్లించి ప్రభుత్వ ఆస్తులు అమ్మే ప్లాన్ అమల్లోకి తెచ్చింది.
ముందుగా రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులు గల జెన్కో, పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను బలవంతంగా అప్పుల్లోకి నెట్టి వాటిని అమ్మేందుకు ఇతర సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇప్పుడు అమరావతిలోని వేల ఎకరాల భూములు, భారీ భవనాలపై కన్నేసింది. ఈ భూములను తాకట్టు పెట్టడం కాదు.. నేరుగా అ మ్మేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది. వాటి అమ్మకానికి అడ్డంగా ఉన్న 3 రాజధానుల చట్టాన్ని నవంబరులోనే హఠాత్తుగా ఉపసంహరించుకుంది.
టెక్నికల్ సమస్యలతో దీనిని ఉపసహరించుకున్నామని, లోపాలన్నీ సరిదిద్ది కొత్తది తెస్తామన్న ప్రకటన పూర్తిగా అబద్ధం. అప్పుల కోసం అమరావతిని, అక్కడి భూములను, భవనాలను వాడుకునేందుకే 3 రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది.
‘ అమరావతిలో ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ఫ్రా కడతాం. అందుకోసం (మనుగడలో లేని) ఏఎంఆర్డీఏ ద్వారా బ్యాంకులను సంప్రదించి రూ.2,995 కోట్ల అప్పు తీసుకొస్తాం. అలా తెచ్చిన అప్పును అమరావతిలో ఉన్న భూములను సంవత్సరానికి కొన్ని ఎకరాల చొప్పున అమ్మేసి తీరుస్తాం’ అని ప్రభుత్వం ఒక నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రానికి ఏదో రకంగా సంపద చేకూర్చే పాలకులను చూశాం గానీ, రాష్ట్ర సంపదను ఎడాపెడా అమ్మిపడేసి వచ్చిన డబ్బులను వృథాగా ఖర్చు చేసే పాలకులుు బహుశా ఒక్క ఆంధ్రలో తప్ప ఎక్కడా ఉండరని చెప్పక తప్పదు.
పాతపనులకే మళ్లీ సోకు
ప్రభుత్వ నివేదికలో ప్రస్తావించిన పనులన్నీ చంద్రబాబు హయాంలో దాదాపు పూర్తయినవే. ఇప్పుడు వాటిని అడ్డంపెట్టుకుని బ్యాంకుల ద్వారా రూ.2,995 కోట్ల అప్పు తెచ్చి వాటికి పైపై మెరుగులు దిద్ది మిగిలిన డబ్బులు సొంత అ వసరాలకు వాడుకోవాలని భావిస్తోంది. ఈ రూ.2,995 కోట్లు వడ్డీతో కలిపి బ్యాంకులకు తిరిగి చెల్లించడానికి ఆ దాయ వనరులు ఏవీ లేవు. కానీ అప్పిచ్చే బ్యాంకుకు ఏదో ఒక ఆదాయ వనరు చూపించాలి.
దీంతో అమరావతిలో భూములను.. అప్పు మొత్తం కట్టే వరకు ప్రతి సంవత్సరం అమ్మి చెల్లిస్తామని అందులో పేర్కొంది. అప్పు మీద వడ్డీ 7 శాతం అమలైతే 481 ఎకరాలు, వడ్డీ 8 శాతమైతే 504 ఎకరాలు అమ్ముతామని తెలిసింది. రుణ కాలపరిమితి 18 ఏళ్లు. ఇందులో రెండేళ్లు మారటోరియం. అంటే ముందు రెండేళ్లు అసలు, వడ్డీ గాని కట్టక్కర్లేదు. మూడో సంవత్సరం నుంచి 16 ఏళ్ల పాటు అసలు, వడ్డీ కట్టాలి. ఇందుకోసం ప్రతి సంవత్సరం అమరావతిలోని కొన్ని ఎకరాల భూమి అమ్ముతూ ఉంటారు. అప్పు చేతికందిన 18 నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తామని చెప్పారు.
ట్రంక్ ఇన్ఫ్రా – ఎల్పీఎస్ ఇన్ఫ్రా
ట్రంక్ ఇన్ఫ్రా కింద ఉత్తరం, దక్షిణం రోడ్లు నిర్మిస్తామని రాశారు. 70.11 కిలోమీటర్ల రోడ్లు, 15 కెనాల్ బ్రిడ్జిలు, 73 కిలోమీటర్ల మేర స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్, కృష్ణా నది మీ ద హైలెవల్ బ్రిడ్జి, నీటి సరఫరా నెటవర్క్, వరద ఉపశమన చర్యలు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఎల్పీఎస్ ఇన్ఫ్రా కింద రోడ్లు, పవర్ నెట్వర్క్ పనులు చేపడతామని పేర్కొంది. ఇందులో ఏ ఒక్క పనీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టే అ వసరం లేదు.
చంద్రబాబు హయాంలోనే ఇవి దాదాపు పూర్తయ్యాయి. కృష్ణా నది మీద బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. సివిల్ వర్కులు జరుగుతున్నాయి. ఇదేదో కొత్త ప్రాజెక్టు అన్నట్లుగా ఇది కట్టడానికి రూ.606 కోట్లు అవుతుందని బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కడతామని నివేదికలో పేర్కొన్నారు. కమర్షియల్ మానెటైజేషన్ కోసం అ మరావతిలోని 5,220 ఎకరాలు వాడుకుంటామని చెప్పారు.
నవంబరులో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ప్రభుత్వం ఉపసహరించుకుంది. అంటే ఏఎంఆర్డీఏ మనుగడలో లేనట్లే. కానీ, డిసెంబరు 10వ తేదీన సీఎస్ డిప్యూటీ సెక్రటరీ మాత్రం ఏఎంఆర్డీఏ నుంచి అప్పు తెచ్చి అమరావతి భూములు తాకట్టు పెడతామంటూ తయారుచేసిన ఫైలుపై సంతకం చేశారు. ఏఎంఆర్డీఏనే లేనప్పుడు ఆ సంస్థ నుంచి అప్పు ఎలా తెస్తారు? ప్రభుత్వం సిద్ధం చేసిన నివేదికలో సీఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ సంతకాలున్నాయి గాని ఏఎంఆర్డీఏ అధికారుల సంతకాలు ఎక్కడా లేవు.
రాజధానిపై హైకోర్టులో కేసులున్నా..
రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం మరో మైండ్ గేమ్‌కు తెర లేపింది. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో హడావుడి ప్రారంభించింది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలు, మంగళగిరి మండలంలోని 3 పంచాయతీలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. ఈ 19 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది.
ఒకపక్క అమరావతి రాజధానిపై దాఖలైన కేసులు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. వాటిపై స్టేటస్కో కొనసాగుతోంది. మరోవైపు సీఆర్డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో ప్రకటన చేసి హైకోర్టుకు నివేదించింది. ఈ పరిస్థితుల్లో కొత్తగా అమరావతి కేపిటల్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమేంటో అర్థం కాని పరిస్థితి.
రాజధాని ఏర్పాటు, అభివృద్ధి కోసం అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏపీసీఆర్డీఏను ఏర్పాటు చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాని పరిధిని స్పష్టంగా పేర్కొని మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించింది. సీఆర్డీఏ పరిధిలోనే అమరావతి కేపిటల్ సిటీని స్పష్టంగా మార్కింగ్ చేశారు.
తుళ్లూరు మండలంలోని నేలపాడు, అబ్బరాజుపాలెం, ఐనవోలు, బోరుపాలెం, పిచ్చుకలపాలెం, కొండమరాజుపాలెం, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, శాకమూరు, దొండపాడు, రాయపూడి, మందడం, తుళ్లూరు, వెలగపూడి, అనంతవరం, వెంకటపాలెం, నెక్కల్లు, మల్కాపురం, మంగళగిరి మండలంలోని కురగల్లు, కృష్ణాయపాలెం, నవులూరు, నిడమర్రు, తాడేపల్లి మండంలోని పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెంతో రాజధాని నగర ప్లాన్‌ను ఆమోదించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే రాజధానిలోని పనులన్నీ నిలిపేసి మూడు రాజధానుల పేరిట రెండేళ్లుగా గేమ్ ఆడుతోంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడంపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్కో జారీ చేసి కొనసాగిస్తోంది. మరోవైపు గతేడాది మార్చి 24వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిని రైతులు పూర్తిగా విభేదించారు. ఆ సందర్భంలోనే రాజధాని నగరం నుంచి నిడమర్రు, నవులూరు, ఆత్మకూరు, యర్రబాలెం, బేతపూడి, ఉండవల్లి, పెనుమాక గ్రామాలను ప్రభుత్వం విడదీసింది. దీనిపైనా హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.
ఇప్పుడు తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలతో పాటు మంగళగిరిలోని కురగల్లు, నీరుకొండ, కృష్ణాయపాలెంలను అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్లో చేర్చినట్లు గుంటూరు కలెక్టర్ వివేక్‌యాదవ్ డిసెంబరు 29నే ఆదేశాలు జారీ చేశారు. అయితే వాటిని గోప్యంగా ఉంచి ఇటీవల గెజిట్ నోటిఫికేషన్లో ప్రచురించారు. ఈ 19 గ్రామాల్లో గ్రామసభలు జరిపారు. కానీ ఒక్క గ్రామం కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించలేదు. కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం గమనార్హం.