2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 సీట్లతో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. జనసేన, బీజేపీ పార్టీలకు తగిన గుర్తింపు ఇస్తూ సీట్ల సర్దుబాటు చేసిన కూటమి పక్ష నేత, ఏపీ సీఎం చంద్రబాబు…ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ పార్టీలకు వారి సీట్లకు తగ్గట్లు కేటాయింపులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో నాలుగు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేసేందుకు చంద్రబాబు రెడీ అయ్యారని తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.
అయితే, కొందరు మంత్రుల పనితీరుపై చంద్రబాబు సంతృప్తిగా లేరు. కాబట్టి, కొందరు కొత్తగా ఎంపికైన మంత్రులకు వారి పనితీరు ఆధారంగా డిమోషన్ ఉండే చాన్స్ కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయా శాఖలను సమర్థవంతంగా నిర్వహించని వారికి శాఖల మార్పు కూడా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు, ఉగాది నాడు మూడో విడత నామినేటెడ్ పదవుల పందేరానికి కూడా తెర లేవనుంది.
60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ కమిటీల నియామకాల కోసం ఒక్క టీడీపీ నుంచే 60 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే పోటీ ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోంది. ఇక, తమకు కూడా మరిన్ని పోస్టులు కావాలని జనసేన, బీజేపీ లు అడుగుతున్నాయి. మరి, ఇంతమంది ఆశావహులను, మిత్ర పక్ష పార్టీలకు న్యాయం చేస్తూ చంద్రబాబు ఏ విధంగా కేటాయింపులు చేస్తారు అన్నది వేచి చూడాలి.