రామతీర్థంలోని దేవాలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటన పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా, బీజేపీ, జనసేనలు ‘రామతీర్థ ధర్మయాత్ర’కు పిలుపునిచ్చాయి. దీంతో, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా పలువురు బీజేపీ, జనసేన కార్యకర్తలు రామతీర్థం చేరుకునేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యాత్ర నేపథ్యంలో పోలీసులు పలువురు బీజేపీ, జనసేన నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాగోలా రామతీర్థం కూడలి వరకూ చేరుకున్న వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట కూడా జరిగింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాటలో వీర్రాజు కింద పడిపోయారు. ఈ క్రమంలోనే రామతీర్థం ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉందంటూ సోము వీర్రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని చెప్పారు. వీర్రాజును నెల్లిమర్ల పోలీసు స్టేషన్ కు తరలించారు.
పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ, జనసేన కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించిన సోము వీర్రాజు పోలీసుల తీరును ఖండించారు. విజయసాయి, చంద్రబాబు లకు అనుమతిచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ధర్మయాత్రను ముందుగానే ప్రకటించామని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా అరెస్టు ఎందుకు చేశారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం దాష్టీకాలు చేస్తోందని , పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచిన బీజేపీ, జనసేన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, విశాఖపట్నం బీజేపీ కార్యాలయాన్ని పోలీసులు దిగ్బంధం చేశారు. ధర్మయాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేశ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లను పోలీసులు ఆఫీసులో పెట్టి తాళం వేశారు. దీంతో, పోలీసుల తీరుకు నిరసనగా విశాఖలో ఉద్రిక్తత ఏర్పడింది.