వైసీపీ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని, ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నవారిపై జగన్ కఠిన వైఖరి అవలంబించకపోవడం వల్లే దుండగులు పేట్రేగిపోతున్నారని విమర్శలు వచ్చాయి. ఇక, జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జగన్ పాలనలో ఏపీలో క్రిష్టియానిటీ పెరుగుతోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా గతంలో సంచలన ఆరోపణలు చేశారు. రికార్డుల ప్రకారం ఏపీలో 1.8 శాతం క్రిష్టియానిటీ ఉండగా…వాస్తవానికి అది 25 శాతం వరుకు పెరిగిందని రఘురామ ఆరోపించారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లని, కానీ,ఎన్నికలలో గెలిచేందుకు హిందువులమని చెప్పుకుంటూ నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు, భారత ప్రధాని నరేంద్ర మోడీకి గతంలోనే లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో తాజాగా జగన్ పై స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఏపీ ఒక క్రైస్తవ రాష్ట్రంగా మారిపోయిందని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో హిందువులు, హిందూ దేవాలయాలు, దేవాలయాల భూములు, హిందూ సనాతన సంప్రదాయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు.
దేవాలయాలపై, విగ్రహాలపై దాడులు చేసిన దోషులను ప్రభుత్వం ఇంత వరకు పట్టుకోలేదని దుయ్యబట్టారు. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను కొందరు మంత్రులు కూడా అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. ప్రజలను ప్రలోభాపెట్టి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇలా మతమార్పిడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దోషులను శిక్షించి హిందువుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు.