తెలంగాణ – ఆంధ్రా సరిహద్దుల వద్ద ఇబ్బందికర వాతావరణం నెలకొంది.
కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల్లో నమోదవుతున్న వేళలో.. ఏపీతో పోలిస్తే హైదరాబాద్ లో వైద్య సదుపాయాలు బాగుండటంతో.. ఏపీ నుంచి తెలంగాణకు వైద్యం కోసం అంబులెన్సుల్లో వస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
రోజు రోజుకు ఈ తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని వారికి.. ముఖ్యంగా హైదరాబాద్ లోని వారికి వైద్య సేవలు అందించటం ఇబ్బందికరంగా మారింది.
దీంతో.. తెలంగాణ సరిహద్దుల్లో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సుల్ని నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించటమే కాదు.. అధికారుల చర్యను తప్పు పట్టింది.
అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లుగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంబులెన్సుల్ని అడ్డుకుంటే చర్యలు తప్పవని స్పష్టం చేసింది ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వాహనాలకు ప్రత్యేక ఈ-పాస్ లను ఏర్పాటు చేసింది. ఆసుపత్రుల నుంచి ముందస్తుగా లేఖ ఉండాలన్న మార్గదర్శకాల్ని సిద్ధం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఏపీ నుంచి వస్తున్న అంబులెన్సులను తెలంగాణ సరిహద్దు అధికారులు మాత్రం అడ్డుకుంటున్నారు.
దీంతో.. పెద్ద ఎత్తున బారులు తీరుతున్నాయి. అంబులెన్సుల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వారు.. తమను విడిచిపెట్టాలంటూ వేదనా స్వరంగా అధికారుల్ని బతిమిలాడుతున్నా.. వాహనాల్ని అనుమతించటం లేదు.
ఇదిలా ఉండగా.. తాజాగా కర్నూలు జిల్లా పంచలింగాల టోల్ గేట్ తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ అంబులెన్సు ఆపటం.. అందులోని రోగి ఒకరు మరణించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడారు.ఎమ్మెల్యే జోక్యం అనంతరం అధికారులు వాహనాల్ని అనుమతించారు.
అయితే.. తెలంగాణకు వచ్చే అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. దీంతో.. అంబులెన్సుల్లో వస్తున్న వారు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రాణాలు కాపాడుకోవటం కోసం అత్యవసర వైద్యం కోసం ఏపీ నుంచి తెలంగాణకు పరుగులు తీస్తున్న బాధితులకు సరిహద్దుల వద్ద అధికారులు తీరు ఇబ్బందిగా మారుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది.
ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో.. సోదర రాష్ట్రంగా ఇచ్చి పుచ్చుకునే దోరణితో వ్యవహరించాలన్న అభ్యర్థన ఏపీ ముఖ్యమంత్రి నుంచి రావాల్సిన అవసరం ఉంది.
ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతున్న వేళ.. సీఎం జగన్ నేరుగా మాట్లాడితే పరిస్థితుల్లో మార్పు రావటమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.