- ఆన్లైన్ ఇంటర్ అడ్మిషన్లు వాటిపై పెత్తనానికే!!
- పద్ధతీపాడూ లేకుండా ఆకస్మికంగా ఆన్లైన్ ప్రకటన
- అడ్మిషన్లపై రెండేళ్ల నుంచీ ఇదే తీరు
నవ్యాంధ్రలో జగన్ ప్రభుత్వ తీరుతో విద్యార్థులు, తల్లిదండ్రుల అగచాట్లకు అంతే లేకుండా పోతోంది. విషయ పరిజ్ఞానం లేని.. మిడిమిడి జ్ఞానం కలిగిన అధికారులు, సలహాదారుల మాటలే ఈ సర్కారుకు వీనులవిందులా అనిపిస్తున్నాయి. ఎలాంటి ముందస్తు కసరత్తు చేయకుండా.. భావి పర్యవసానాలు ఆలోచించకుండా.. కేవలం రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటోందని అనడానికి ఇంటర్ కాలేజీల్లో ఆన్లైన్ అడ్మిషన్ల తంతే పెద్ద ఉదాహరణ.
కాలేజీలు తమ దారికి రాకుంటే భూస్థాపితం చేస్తామని బెదిరిస్తోంది. ప్రైవేటు కాలేజీలపై పెత్తనం కోసం.. వాటిని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. పేరున్న కాలేజీల్లో విద్యార్థులు చేరకుండా.. వివిధ సాకులతో వాటిని ఆన్లైన్ అడ్మిషన్ల జాబితా నుంచి తొలగించింది.
సాధారణంగా రాయలసీమకు చెందిన విద్యార్థులు ఎక్కువగా విజయవాడ, గుంటూరుల్లో ఇంటర్ చదువుతుంటారు. వారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అడ్మిషన్లు తీసుకోకుండా.. స్థానికంగానే చదువుకోవాలని ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే ఆయా కాలేజీలు వసూలు చేయాల్సిన ఫీజులను గణనీయంగా తగ్గించి వాటిని దెబ్బతీసింది. ఇప్పుడు విద్యార్థులు కూడా సరిపడా చేరకుండా ఆన్లైన్ అడ్మిషన్ల విధానం తెచ్చింది. హైకోర్టు దీనిని కొట్టివేయడంతో ఇరకాటంలో పడింది.
రాష్ట్రంలోని ఇంటర్ కళాశాలల్లో సుమారు 11 లక్షల సీట్లు ఉన్నాయి. అదేసమయంలో పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రం 5.65 లక్షల మందే ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 50 వేల మంది వస్తారని అంచనా వేసినా.. మొత్తంగా ఇంటర్లో చేరే విద్యార్థుల సంఖ్య ఆరు లక్షలకు మించదు. అంటే దరఖాస్తు చేసుకున్నవారందరికీ సీట్లు వస్తాయి.
ఎవరికి ఏ కళాశాల నచ్చితే అక్కడ చేరి చదువుకోవచ్చు. అయినప్పటికీ ‘ఆన్లైన్ అడ్మిషన్లు’ అంటూ ఇంటర్ బోర్డు చేసిన హడావుడి ప్రకటనలు.. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అయోమయాన్ని సృష్టించాయి. అంతేకాదు.. అసలు ఈ విధానాన్ని ఎందుకు తెచ్చారో కూడా స్పష్టం చేయలేదు. పోనీ.. ఫీజుల నియంత్రణ కోసం చేపట్టారనుకున్నా.. ఫీజులకు, ఆన్లైన్ అడ్మిషన్లకు సంబంధమే లేదు.
గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని ఇంటర్ కళాశాలలకు ఫీజును ఇప్పటికే నిర్ణయించారు. అడ్మిషన్లు ఏ రకంగా జరిగినా నిర్ణీత ఫీజులనే చెల్లించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మరి ఆన్లైన్ అడ్మిషన్లు ఎవరి ప్రయోజనం కోసం అనేది ప్రశ్న.
విద్యార్థులు నచ్చిన కళాశాలకు వెళ్లి పరిశీలించి, అక్కడ యాజమాన్యంతో మాట్లాడి చేర్చించే వెసులుబాటును పక్కన పెట్టి.. ఆన్లైన్ ప్రవేశాలకు అనుమతించడంలో ఆంతర్యం ఏమిటన్నది అంతుబట్టని విషయం. పోనీ.. ఒకవేళ ఆన్లైన్ అడ్మిషన్లే చేద్దామని అనుకుంటే.. దీనిపై తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముందుగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా లేదా? ఈ హడావుడి వెనుక ఇంటర్‌బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ వ్యవహారమే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆయన దూకుడు వల్లే ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైందనే విమర్శలు వస్తున్నాయి. ఐఆర్ఎస్ అధికారైన ఆయన విద్యావ్యవస్థను సక్రమంగా, సాఫీగా నడిపించడంపై దృష్టిపెట్టకుండా.. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆందోళన కలిగించేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోనీ.. కరోనా వల్లే ఇలా ఆన్లైన్ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నా.. ఈ విషయాన్ని సంబంధిత జీవోల్లో ఎక్కడా పేర్కొనకపోవడాన్ని హైకోర్టు కూడా వేలెత్తిచూపింది.
గత ఏడాదీ ఇంతే!
గత ఏడాది కూడా విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్లో ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీనిపై ఇదేం పద్ధతి అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు హైరానా పడ్డారు. అదేసమయంలో ఇంటర్ కళాశాలల మేనేజ్మెంట్లు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ సంబంధిత జీవోను కొట్టేసింది.
తగిన ప్రచారం కల్పించి, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ అడ్మిషన్లు చేసుకోవచ్చని చెప్పింది. కానీ ఈ ఏడాది కూడా మళ్లీ అదే తంతు. ఆగస్టులో ఆన్లైన్ అడ్మిషన్లు అని ప్రకటించారు. కోర్టులో తీర్పు రిజర్వులో ఉండగానే.. రెండో విడత ఆన్లైన్ అడ్మిషన్లను ఈ నెల 1 నుంచి ప్రారంభించారు.
ఇంటర్‌బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ‘ ఏపీఆన్‌లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియట్ సీ్ట్రం(ఏపీఓఏఎ్సఐఎస్)’ వ్యవస్థను ప్రవేశపెడుతూ ఆగస్టు 10న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఇంటర్ ప్రవేశాల విషయంలో గతంలో అనుసరించిన విధానాన్నే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ పాటించాలని స్పష్టం చేసింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ ప్రవేశాలు జరపాలని భావిస్తే.. విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో ఎక్కడా పేర్కొనలేదని గుర్తు చేసింది.
ఆన్లైన్ ప్రవేశాల నిర్వహణ కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఇంటర్ బోర్డుకు బదలాయించడం సరికాదని, బోర్డు తీసుకున్న నిర్ణయానికి చట్టబద్ధత లేదని పేర్కొంది. ఇంటర్ బోర్డుకు అధికారం ఇవ్వడమంటే ప్రభుత్వం తన కర్తవ్య నిర్వహణకు దూరంగా ఉండడమేనని వ్యాఖ్యానించింది. కొవిడ్ నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేసిన నేపఽథ్యంలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తామని చెప్పడం అర్థరహితమని తెలిపింది.
కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకున్నారని ఇంటర్ బోర్డు చెబుతున్నప్పటికీ.. నిబంధనలకు అనుగుణంగా లేని నోటిఫికేషన్‌ను అనుమతించలేమని స్పష్టం చేసింది.