దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అవకాశాలకు కేంద్రప్రభుత్వం బార్లా తలుపులు తెరిచింది. ఇన్ని సంవత్సరాలు దేశం మొత్తం ఒకదారి అయితే జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానిది మాత్రం మరో దారి అన్నట్లుగా ఉండేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రేతరులు ఎవరు కూడా ఏదో చుట్టపుచూపుగా వచ్చి నాలుగు రోజులుండి వెళ్ళాల్సిందే. ఎన్నిరోజులు అయినా కాశ్మీర్ లో పర్యటకుడి హోదాలో ఉండాల్సిందే కానీ సొంతంగా భూమి కొనాలన్నా, ఓ ఇల్లు కొనాలన్నా అవకాశం లేదు. అలాంటిది తాజాగా కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇకనుండి దేశంలో ఎవరైనా జమ్మూ కాశ్మీర్లో భూములు, భవనాలు కొనచ్చు.
దశాబ్దాల పాటు జమ్మూ కాశ్మీర్ కున్న ప్రత్యేక ప్రతిపత్తిని నరేంద్ర మోడి ప్రభుత్వం రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. స్వయంప్రతిపత్తి కారణంగానే పై రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారి ప్రవేశాలకు అనేక అడ్డంకులుండేవి. స్వయంప్రతిపత్తి రద్దు కారణంగా మిగితా దేశానికి తలుపులు బార్లా తెరిచినట్లయ్యింది. దీని కారణంగా ఇతర రాష్ట్రాల పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఇక్కడ స్ధిరాస్తులు కొనచ్చు. అలాగే వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరైనా స్ధిరపడాలని అనుకుంటే అందుకు కూడా అవకాశాలున్నాయి.
అయితే వ్యవసాయ భూములను మాత్రం కొనేందుకు లేదు. వ్యవసాయేతర భూములు కొనచ్చు, అమ్మచ్చని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రప్రభుత్వం ఒక్క వ్యవసాయ భూములపైన మాత్రం నిషేదం కంటిన్యు చేస్తోంది. ఇతర రాష్ట్రాల వాళ్ళెవరు పై రాష్ట్రంలో వ్యవసాయ భూములు కొనేందుకు లేదని ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. పరిశ్రమలను ప్రోత్సహించటం, ఉపాధి అవకాశాలను పెంచటం కోసమే ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు లెఫ్ట్ నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టంగా ప్రకటించారు.
జమ్మూ-కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయటంపై దాయాది దేశం పాకిస్ధాన్ నానా గొడవ చేస్తోంది. ఆర్టికల్ 370ని అడ్డం పెట్టుకుని పాకిస్ధాన్ జమ్ము కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రూల్స్ ను వాడుకుని ఎంతోమంది ఉగ్రవాదులు, తీవ్రవాదులను మనదేశంలోకి పంపేది. విచిత్రమేమిటంటే మునుపు మనదేశంలోని ఏ రాష్ట్రం వాళ్ళకు జమ్మూ-కాశ్మీర్లో ఏ రకంగా కూడా పౌరసత్వం లభించదు. కానీ జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని వివాహం చేసుకుంటే పాకిస్ధాన్ యువకులు మాత్రం వెంటనే పౌరులు అయిపోతారట.
ఇటువంటి అనేక లొసుగులను అడ్డంపెట్టుకుని వేలాదిమంది టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లో తిష్టవేశారు. ఇందుకే ఒకపుడు టూరిస్టులకు స్వర్గదామంగా నిలిచిన ఈ రాష్ట్రం ఇఫుడు టెర్రరిస్టులకు నిలయంగా మారిపోయింది. మొత్తానికి కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్లయినా ఉగ్రవాదం తగ్గుతుందేమో చూడాలి.