బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించిన పద్మావత్ సినిమా వ్యవహారం కొద్ది సంవత్సరాల క్రితం రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ పలు హిందూ సంఘాలు, ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ చిత్రంపై కూడా కొంతకాలంగా వివాదం రేగుతోంది.
ఈ సినిమాలో బేషరమ్ రంగ్ పాటలో దీపికా కాషాయ రంగు బికినీ ధరించిందని, ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలపై, అనవసర వివాదాలపై బిజెపి నేతలు ఎవరు స్పందించవద్దంటూ ప్రధాని మోదీ నిన్న చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆ ప్రకటనపై బీజేపీ వ్యతిరేకిగా ముద్రపడ్డ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. నాలుగేళ్ల క్రితం మోడీ ఈ సూచనలు చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికే బాలీవుడ్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అభిప్రాయపడ్డారు.
పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయని, ఎవరి మాటా ఎవరూ వినే పరిస్తితులు లేవని అన్నారు. అల్లరి మూకలు కట్టు తప్పాయని వాటిని అదుపు చేయడం ఇప్పుడు సాధ్యపడే విషయం కాదని అన్నారు. బాలీవుడ్ బాయ్ కాట్ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కోరారు. ఈ నేపథ్యంలోనే సినిమాల విషయంలో, వివాదాల్లో తల దూర్చవద్దంటూ బిజెపి నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఏది ఏమైనా ఆకులు కాలాక చేతులు పట్టుకున్నట్టు మోదీ చేసిన ప్రకటన ఉందని కశ్యప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.