గత నెల రోజులుగా బెయిల్, ముందస్తు బెయిల్ కోసం ఎదురుచూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు మార్పు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఆ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్వర్వులు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. దీంతో, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఇన్నర్ రింగు రోడ్డు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఇక, అంగళ్లు కేసులో రేపటివరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది.