కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ప్రపంచం ఎంతలా ఆగమాగమైందో తెలిసిందే. మొదటి.. రెండో వేవ్ ల దెబ్బకు దేశాలకు అతీతంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ షాక్ నుంచి బయటకు వస్తున్నాయి. భారత్ విషయానికి వస్తే.. మే మొదటి వారంలో రోజుకు 4 లక్షల కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి ఇప్పుడు రోజుకు 50వేలకు కేసుల నమోదు తగ్గింది.
సెకండ్ వేవ్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి డెల్టా వేరియంట్ ఇప్పుడు వెంటాడుతోంది. ఇది సరిపోదన్నట్లుగా ‘డెల్టా ప్లస్’ మరో ముప్పులా మారింది. పలు దేశాల్లో డెల్టా వేరియంట్ విరుచుకుపడుతోంది. దీంతో అన్ని దేశాలు డెల్టా కేసులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇలాంటివేళ.. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు.. వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
కొవిడ్ ఎపిసోడ్ లో మిగిలిన అన్ని వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా డేంజర్ అని పేర్కొన్నారు. అమెరికాలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో 20 శాతానికి పైగా డెల్టా వేరియంట్ కు సంబంధించినవేనని.. వారం క్రితం ఇది కేవలం పది శాతం మాత్రమే ఉందని చెప్పారు. వారం వ్యవధిలోనే రెట్టింపు అయ్యిందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. యూకేలో డెల్టా వేరియంట్ ఆ దేశాన్ని వణికిస్తోంది. డెల్టా వేరియంట్ ఇప్పుడో బ్యాడ్ న్యూస్ గా మారింది. అయితే.. ఈ ఎపిసోడ్ లో గుడ్ న్యూస్ కూడా చెప్పారు ఫౌచీ. అమెరికాలో డెవలప్ చేసిన టీకాలు.. డెల్టా వేరియంట్ సమర్థంగా పని చేస్తుందని.. దీని ప్రభావం బాగుందని చెప్పారు. వణికే బ్యాడ్ న్యూస్ తో పాటు ధీమాను పెంచే గుడ్ న్యూస్ కూడా చెప్పారని చెప్పక తప్పదు.