అధికారంలో ఉన్నపుడు తనిష్టారాజ్యంగా వ్యవహరించిన కేసీఆర్ కు ఇపుడు చుక్కలు కనబడుతున్నాయి. పార్టీ ఆపీసు నిర్మాణం కోసమంటు కేటాయించుకున్న అత్యంత విలువైన భూమి ఇపుడు కోర్టు విచారణను ఎదుర్కొంటోంది. కేసీయార్ హయాంలో బీఆర్ఎస్ పార్టీ ఆపీసు కోసం కోకాపేటలో 11 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వానికి భూమిని కేటాయించాలని ప్రతిపాదనలు పంపిన కేసీయార్ ప్రతిపాదనలు అందగానే వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఫైలుగా ఆమోదం తెలిపేశారు.
అంటే పార్టీ ఆఫీసుకు అత్యంత ఖరీదైన 11 ఎకరాలను సొంతం చేసుకోవటంలో డబల్ యాక్షన్ చేసినట్లు అర్ధమైపోతోంది. ఈ విషయమై అప్పట్లోనే అన్నీ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా ఆ వ్యతిరేకతను కేసీయార్ పట్టించుకోలేదు. కోకాపేటలో ఎకరా రు. 100 కోట్లుంది. అంతటి ఖరీదైన 11 ఎకరాలు అంటే రు. 1100 కోట్లు ఖరీదుచేసే భూమిని రు. 37.53 కోట్లకే బీఆర్ఎస్ సొంతం చేసేసుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి అంతా నడిచిపోయింది. అప్పట్లో ఈ విషయమై కోర్టులో కేసు పడింది. ఆ కేసును గురువారం హైకోర్టు విచారణకు స్వీకరించింది.
పిటీషన్ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరపాలని చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్ ను ఆదేశించారు. కేసీయార్ తో పాటు అప్పట్లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, రెవిన్యు ముఖ్య కార్యదర్శితో పాటు లావాదేవీలతో సంబంధాలున్న అధికారులు అందరిపైనా కేసులు నమోదుచేయాలని పిటీషనర్ తన పిటీషన్లో కోర్టును కోరారు. పార్టీ ఆఫీసుకు భూమి కావాలని పార్టీ కార్యదర్శి పేరుతో లేఖ అందినా అధ్యక్షుడు కేసీయారే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే కేసీయార్ మీద కూడా కేసు పెట్టాలని పిటీషనర్ కోర్టును కోరారు.
నిజానికి ఇంతటి విలువైన భూములను, ప్రజల ఆస్తులను ఒక రాజకీయపార్టీకి కట్టబెట్టడం చాలా తప్పు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో భూమిని కేటాయించారంటే అర్ధముంది. ఎందుకంటే పార్టీకి భూమిని కేటాయించిన కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయనే కారణాన్ని చెప్పుకవచ్చు. కానీ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన కోకాపేటలో 11 ఎకరాల భూమిని కేటాయించుకోవటం అంటే అచ్చంగా అధికారదుర్వినియోగానికి పాల్పడటమే అని చెప్పాలి. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.