జగన్ కు విధేయుడిగా పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనతో పొసగని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధిక్యతను స్పష్టం చేస్తూ.. పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం బాలినేని కి దిమ్మ తిరిగేలా షాకిస్తుందన్న మాట వినిపిస్తోంది. మంగళవారం వెల్లడైన ఒక ప్రకటన ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు.. కొత్త బాపట్ల జిల్లా అధికారపార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు భవనం శ్రీనివాసరెడ్డి.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన ఆయన మొదట్నించి బాలినేనికి ప్రధాన అనుచరుడు. ఆయన సతీమణి జెడ్పీటీసీ సభ్యురాలు. పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి క్రిష్ణమోహన్ కు.. మంత్రి బాలినేనికి పెద్దగా పడదన్న విషయం తెలిసిందే. వీరి మధ్య ఉన్న గ్యాప్ అంతకంతకూ పెరగటమే కాదు.. వారిద్దరి మధ్య పూడ్చలేనంత దూరం పెరిగినట్లుగా చెబుతారు. ఇదిలా ఉండగా.. బాలినేనికి సన్నిహితుడైన భవనం శ్రీనివాసరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా అమంచి పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ ఒక ప్రకటనను జారీ చేసింది. దీని సారాంశం.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న భవనం శ్రీనివాసరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది.. మాజీ మంత్రి బాలినేనికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. భవనం తీరును తప్పు పట్టి.. ఆయనపై చర్యలకు పట్టుపట్టి మరీ అమంచి తన పంతాన్ని నెరవేర్చుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. తనకు అత్యంత సన్నిహితుడైన భవనం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయటాన్ని బాలినేని తీవ్రంగా పరిగణించినట్లుగా చెబుతున్నారు.
పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామం.. తనకు అత్యంత సన్నిహితుడిపై వేటు వేసే విషయాన్ని కనీసం తనకు సమాచారం అందించకుండా అధికారి ప్రకటన రావటాన్ని తీవ్రంగా పరిగణించినట్టుగా చెబుతున్నారు. సస్పెండ్ చేసిన భవనంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని సీఎంను కోరినట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.