కొద్ది నెలలుగా ఏపీలో పంచాయతీ ఎన్నికల పంచాయతీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపడంతో ఏపీ సర్కార్ కు ఎన్నికలు నిర్వహించడం మినహా మరో ఆప్షన్ లేకుండా పోయింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడంతో వైసీపీ నేతలు ఎన్నికలు వాయిదా వేయడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారన్న టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో అఖిల అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ విచారణపై వైసీపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో దాదాపు 3.5 లక్షలమంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతున్నారని అఖిల పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో, కొత్త జాబితాను సిద్ధం చేసి, దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలని హైకోర్టుకు అఖిల విజ్ఙప్తి చేశారు. అయితే, తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు….జగన్ సర్కార్ ఆశలపై నీళ్లు చల్లింది.
2019 జనవరి 1 నాటి ఓటర్ల జాబితా ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తాజాగా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2019 ఓటర్ల జాబితా అంశంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. పిటిషనర్ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం…ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమంటూ తేల్చిచెప్పింది. దీంతో, ఎన్నికల వాయిదాకు జగన్ సర్కార్ కు లీగల్ గా ఉన్న ఒక్క ఆశ పోయినట్లయింది. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ అని, అందుకే ఆ పిటిషన్ ను హైకోర్టు తీవ్రంగా పరిగణించి ఎన్నికలు వాయిదా వేయాల్సిందిగా ఆదేశించలేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా, తాజాగా జగన్ సర్కార్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురు కావడంతో పంచాయతీ ఎన్నికల పంచాయతీకి పూర్తి స్థాయిలో శుభం కార్డు పడ్డట్టే. ఇక, అలజడులు, అల్లర్లు సృష్టించి ఎన్నికలు వాయిదా వేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటువంటి ఘటనలు జరిగి….ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే తప్ప దాదాపుగా ఏపీలో ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.