ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టులో ఈరోజు చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై వాదించేందుకు ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా రెడీ అవుతున్నారు. అయితే, అనూహ్యంగా చంద్రబాబును మరో కేసులో విచారణ జరిపేందుకు ఏపీ సిఐడి అధికారులు రెడీ అవుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును విచారణ జరిపేందుకు పీటీ వారెంట్ పిటిషన్ ను సిఐడి అధికారులు దాఖలు చేశారు. రిమాండ్ ఖైదీని మరో కేసులో విచారణ జరపడానికి పీటీ వారెంట్ (ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్) కోరతారు.
ఒకవేళ ఆ పిటిషన్ ను జడ్జి అనుమతిస్తే రేపు విచారణ జరిగే చాన్స్ ఉంది. 2022లో అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయని ఏ1గా చంద్రబాబు, ఏ2గా అప్పటి మంత్రి నారాయణపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ విచారణ పూర్తయింది. ఆ నివేదికను కూడా కోర్టుకు సమర్పించింది. ఆ తర్వాత హైకోర్టు నుంచి నిందితులు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో తీర్పు రిజర్వులో పెట్టారు. మరి, తాజాగా చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన నేపథ్యంలో ఆ కేసు విచారణ కూడా జరుపుతామని సీఐడీ అధికారులు కోరుతున్నారు. స్కిల్ కేసులో 5 రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి సీఐడీ కోరిన సంగతి తెలిసిందే.