కరోనా మహమ్మారి బారినపడి అతలాకుతలమవుతున్న ప్రపంచ దేశాలు…ఇపుడిపుడే వ్యాక్సినేషన్ పై ఆశలు చిగురించి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే యూకేలో బయటపడ్డ కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్ స్ట్రెయిన్….ఆ ఆశలపై నీళ్లుచల్లింది. కరోనా కన్నా…70 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ వల్ల బ్రిటన్ తో చాలా ప్రపంచ దేశాలు రాకపోకలు నిషేధించాయి.
గతంలో చైనా తరహాలో ఇపుడు బ్రిటన్ కూడా తల్లడిల్లుతున్న నేపథ్యంలో ఆ దేశానికి మరో పిడుగులాంటి వార్త అందింది. దక్షిణాఫ్రికాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ మరో వేరియంట్ ఇపుడు బ్రిటన్ లోనూ బయటపడింది. దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ కరోనావైరస్ కు సంబంధించిన రెండు కేసులను బ్రిటన్ లో గుర్తించినట్లు బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ చెప్పారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్ వచ్చినవారిలో ఈ వైరస్ ను గుర్తించామన్నారు.
స్ట్రెయిన్ కంటే ఈ కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, లండన్ లో కనుగొన్న కొత్త వేరియంట్ కంటే ఎక్కువ పరివర్తన చెందినట్లు కనిపిస్తుందని హాంకాక్ చెప్పారు. గడచిన 15 రోజులలో దక్షిణాఫ్రికాలో ఉన్న వారందరితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా పరీక్షలు చేస్తామనన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుండి వచ్చే ప్రయాణ రాకపోకలపై నిషేధం విధించామని తెలిపారు. డిసెంబర్ 26 నుండి బ్రిటన్లో ముఖ్యంగా దక్షిణ బ్రిటన్ లో అంక్షలు మరింత కఠినతరం చేయనున్నామని తెలిపారు.
మరోవైపు, బ్రిగన్ నుంచి రాకపోకలు నిషేధించిన భారత్ కరోనా కొత్త వేరియంట్ స్ట్రెయిన్ పై అప్రమత్తమవుతోంది. బ్రిటన్ నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించి…వారిని ఐసోలేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ లో ఆ వేరియంట్ లేదని కేంద్రం చెబుతోంది.ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ లు కొత్త వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏది ఏమైనా, కొత్త సంవత్సరంలో అయినా కరోనా పీడ విరగడవుతుందనుకున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు న్యూ ఈయర్ గిఫ్ట్ లుగా వచ్చాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.