తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ ల మధ్య కొంతకాలంగా విభేదాలున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి ఫైలును తమిళిసై పక్కనబెట్టడంతో మొదలైన ఈ వివాదం…అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే తాజాగా తమిళిసైకి మరోసారి అవమానం జరిగింది. ఉగాది పండుగను పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
ఆలయ పునర్నిర్మాణం తర్వాత మొదటిసారిగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ కు అధికారులు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశమైంది. ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌కు ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకాల్సి ఉంది. కానీ, ఈవో, కలెక్టర్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడం చర్చకు తావిచ్చింది. అదనపు కలెక్టర్, ఆలయ ఏఈవో మాత్రమే గవర్నర్‌కు స్వాగతం పలికి, వారి వెంట ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో సమ్మక్క-సారలమ్మ దర్శనం సమయంలోనూ గవర్నర్ కు స్థానిక కలెక్టర్, జిల్లా ఇన్చార్జి మంత్రి నామమాత్రంగాకూడా స్వాగతం పలకకపోవడం వివాదాస్పదమైంది. ప్రొటోకాల్‌ను అమలు చేయకపోవడంతో గవర్నర్ విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామంతో అది మరింత పెరిగిందని, తమిళిసై, కేసీఆర్ ల మధ్య వివాదం తారస్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది.
కాగా, ఉగాదినాడు యాదాద్రి లక్ష్మీనృసింహస్వామివారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. భర్త సౌందరరాజన్ పెరియస్వామితో కలిసి యాదాద్రీశుడిని దర్శించకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, ఈ ఏడాదిలో ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాని ఆమె తెలిపారు. కరోనా నియంత్రణలోకి వచ్చిందని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.