జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని, గొప్పలకు పోయి ఏపీని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీడీపీ సహా విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని విపక్షాలతోపాటు కంప్ట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) కూడా చాలాసార్లు చెప్పింది. జగన్ ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో దాదాపు అర్థ రూపాయి అప్పేనని ఎన్నోసార్లు తేల్చింది. అయినా సరే, ఏపీ అప్పుల కుప్పను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్.
మూడేళ్ల పాలనలో జగన్ దాదాపు ఐదున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో ముచ్చటగా మూడు లక్షల కోట్లకు లెక్కలు లేవని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు, జగన్ చేసిన అప్పుల చిట్టాను గణాంకాలతో సహా వారు బట్టబయలు చేస్తున్నారు. అయితే, జగన్ కు షాకిచ్చే గణాంకాలను ఆయన ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న దువ్వూరి కృష్ణ గతంలో వెల్లడించారు. 2022 ఏడాది మార్చి నాటికి ఏపీ మొత్తం అప్పులు రూ.4,98,799 కోట్లకు చేరుకున్నాయని షాకింగ్ విషయం చెప్పారు.
అయినా సరే తన పథకాల కోసం అప్పులు చేస్తూనే పోతున్న జగన్ తాజాగా మరో వెయ్యి కోట్ల అప్పును జనం నెత్తిన వేశారు. ఏపీ సర్కార్ తాజాగా మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గణాంకాలతో సహా వెల్లడించారు. ఆర్బీఐలో జరిగిన బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుందని ట్వీట్ చేశారు. తాజాగా జగన్ తీసుకున్న రుణంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ తీసుకున్న మొత్తం అప్పు రూ.47,608 కోట్లకు చేరిందని జీవీ రెడ్డి తెలిపారు.
వాస్తవానికి ఏపీకి ఈ ఏడాదికి ఏఫ్ఆర్బీఎం పరిమితి రూ.48 వేల కోట్లు అని, కానీ, ఆరు నెలలు కూడా పూర్తికాకుండానే జగన్ మొత్తం పరిమితి మేర అప్పు చేశారని విమర్శించారు. ఇంకా, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాల వివరాలు అందుబాటులో లేవని తెలిపారు. ఈ క్రమంలోనే జగన్ తరహాలో ఈ రేంజ్ లో అప్పులను చంద్రబాబు జన్మలో చేయలేరని సోషల్ మీడియాల కామెంట్లు వస్తున్నాయి.