ఇండియాలో ఒకప్పుడు సినిమాల నిడివి మినిమం రెండున్నర గంటలు ఉండేది. రెండున్నర గంటలు అన్నది స్టాండర్డ్ రన్ టైం కాగా.. చాలా వరకు సినిమాలు అంతకంటే ఎక్కువ నిడివితోనే ఉండేవి. కానీ సోషల్ మీడియా ఊపందుకున్నాక కొంచెం నిడివి ఎక్కువ అయితే ల్యాగ్ ల్యాగ్ అనడం ఎక్కువైంది. దీంతో ఎడిటింగ్ టేబుల్ దగ్గర కత్తెరకు పని చెప్పడం ఎక్కువైంది.
పాటలు, అనవసర సీన్లు తీసేసి 2-2.15 గంటల నిడివితో సినిమాలు రిలీజ్ చేయడం ఎక్కువైంది. కానీ ఈ మధ్య మళ్లీ ట్రెండ్ మారుతోంది. కంటెంట్ ఉంటే నిడివి పెద్ద సమస్య కాదన్న అభిప్రాయం బలపడుతోంది. దర్శక నిర్మాతలకు ఆ రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో రంగస్థలం, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ముఖ్య పాత్ర పోషించాయి. అర్జున్ రెడ్డిని దాదాపు నాలుగ్గంటల నిడివితో తీసిన సందీప్ రెడ్డి.. చివరికి 3 గంటలకు కాస్త ఎక్కువ రన్ టైంతో రిలీజ్ చేశాడు. దానికి ఎలాంటి పలితం వచ్చిందో తెలిసిందే.
సందీప్ కొత్త చిత్రం యానిమల్ రన్ టైం మూడున్నర గంటల దాకా ఉంటుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చోపచర్చలు జరిగాయి. ఇప్పుడు ఈ సినిమా నిడివి విషయంలో అధికారిక ప్రకటనే వచ్చేసింది. స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డినే ఈ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. అంతే కాక సినిమాకు ఏ సర్టిఫికెట్ వచ్చిందని కూడా వెల్లడించాడు.
ప్రోమోల్లో బ్లడ్, వయొలెన్స్ చూశాక ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వస్తుందన్నది అందరూ ఊహించిన విషయమే. ఐతే రన్ టైం విషయంలో మాత్రం సందీప్ కొంచెం చూసుకుని తగ్గిస్తాడేమో అనుకున్నారు. కానీ అతను రాజీ పడలేదు. 3 గంటల సినిమాలు చూశాం కానీ.. ఇది మరీ ఎక్కువ రన్ టైం. ఇంత నిడివితో మెప్పించడం సవాలే. మల్టీప్లెక్సుల్లో షోల షెడ్యూలింగ్ కూడా కష్టమే. మరి సందీప్ రెడ్డి కాన్ఫిడెన్స్ ఏంటో చూడాలి.