నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేదు. ప్రతిపక్ష నేతలపై దూషణలతో విరుచుకుపడడం, వారిని దుర్భాషలాడడం, వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయనకు పరిపాటి అని విమర్శలు ఉన్నాయి. ఇక, మంత్రి పదవి నుంచి అనిల్ కుమార్ ను తొలగించిన తర్వాత ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు రాబోయే ఎన్నికలకు ముందు అనిల్ పార్టీ మారబోతున్నారని కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో అనిల్ కుమార్ యాదవ్ కు ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు హాజీపై గత రాత్రి దాడి జరిగింది. వైసీపీ విద్యార్థి నేత అయిన హాజీ ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే హాజీని రూప్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ను రూప్ కుమార్ టార్గెట్ చేశారు. ఈ దాడి వెనుక అనిల్ కుమార్ హస్తం ఉన్నట్టు హాజీ ఆరోపిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి దాడులు సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, రూప్ కుమార్ వ్యాఖ్యలపై అనిల్ కుమార్ మండిపడ్డారు. నెల్లూరులో ఏం జరిగినా తనపై బురద జల్లుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. హాజీపై దాడితో తనకు సంబంధం లేదని అన్నారు. సరైన ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేస్తే ఊరుకోబోనని అనిల్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.