ఏపీలో నిరసన సెగలు ఆకాశాన్నంటుతున్నాయి. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు.. ఇంకో వైపు వలంటీర్లు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులు ఒకే సమయంలో వైసీపీ సర్కారుపై ఒత్తిడి పెంచారు. తమను పర్మినెంట్ చేయాలని, తమ జీతాలను పెంచాలని, తమ డిఆండ్లను పరిష్కరించాలని, తమ ఉద్యోగాలకు భరోసా ఇవ్వాలని.. ఇలా అనే డిమాండ్లతో వైసీపీ సర్కారుపై విపరీతమైన ఒత్తిడి పెంచాయి.
ఇక ఈ క్రమంలో మంత్రుల ఇళ్ల ముందు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉద్యమిస్తున్నారు. నిజానికి నిరసనలు అంటే.. ఏదైనా పర్టిక్యులర్ ప్రాంతాన్నిఎంచుకుని నిరసన వ్యక్తం చేయడం సహజం. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సాధారణ తీరుకు భిన్నంగా నిరసన కారులు మంత్రుల ఇళ్లను ఎంచుకుని.. ఆయా ఇళ్ల ముందే నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం ఉదయాన్నే.. వేల సంఖ్యలో అంగన్వాడీ లు మంత్రి బొత్స సత్యానారాయణ ఇంటిని ముట్టడించారు.
విజయనగరం జిల్లాలోని మంత్రి బొత్స నివాసానికి చేరుకున్న వేలాదిమంది అంగన్వాడీలు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వేడెక్కించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అయితే.. ఈ నిరసనకు వచ్చిన వారితో బొత్స ఇంటి చుట్టుపక్కల దాదాపు కిలో మీటరు దూరం మేర.. రోడ్డు జనంతో కిక్కిరిసి పోయింది. ఎటు చూసినా.. అంగన్వాడీ యూనిఫాంలో ఉన్న మహిళలే కనిపించారు. ఇసకేస్తే రాలనంతగా పరిస్థితి మారిపోయింది.
నిరసన అని తెలియనివారైతే.. ఇక్కడేమైనా బహిరంగ సభ జరుగుతోందా? అని ఆశ్చర్యపోయారు. అంత గా అంగన్వాడీ కార్యకర్తలు బొత్స ఇంటిని చుట్టుముట్టేశారు. అయితే.. అప్పటికే విషయం తెలిసి.. అక్కడ కు చేరుకున్న పోలీసులు కూడా.. వేల సంఖ్యలో తరలి వచ్చిన అంగన్వాడీలను చూసి బిత్తరపోయారు. సంఖ్యా బలం ఎలా ఉన్నా. అంగన్వాడీల ఆత్మ ఘోష మాత్రం ఈ నిరసనతో పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి.