ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణం నుంచి మరింత దారుణం అనే పరిస్థితికి పడిపోయిందా? ఎప్పుడు కుప్ప కూ లుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందా? అంటే.. ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు.. ప్రభుత్వానికి గుదిబండగా మారిందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు న్న పరిస్థితి కొన్నాళ్లు కొనసాగితే.. ఆర్థిక పరిస్థితి కుప్పకూలడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే.. మొదటి ఆరు నెలల్లోనే రాష్ట్ర బడ్జెట్ అంచనాలు తారుమారు అయిపోయాయి. ఆదాయం కంటే అప్పులు ఎక్కువై రాష్ట్రం ఇబ్బందుల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే.. గడిచిన ఐదు నెలల కాలంలో ఖజానాకు అదనపు ఆదాయం వచ్చినప్పటికీ.. చేస్తున్న వ్యయం..(అవి సంక్షేమం కావొచ్చు.. మరేదైనా ఖర్చు కావొచ్చు) ఎక్కువ కావడంతో అంచనాలు మారిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు కూడా రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది ఆర్థిక శాఖ వర్గాల మాట.
అమ్మ ఒడి వాయిదా అందుకే!
రాష్ట్ర పరిమితిలో 99 శాతం మేర అప్పు ఇప్పటికే తీసుకోవడంతో.. తదుపరి సంక్షేమ పథకాల అమలుకు నిధుల సమస్య వేధిస్తోంది. ఇందులో భాగంగానే నవరత్నాల్లో కీలకమైన.. అమ్మఒడి పథకం అమలును 2022 జూన్ కి వాయిదా వేసినట్టు ఆర్థిక శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
గడిచిన ఐదు నెలల కాలంలో పన్నుల పెంపు కారణంగా 15,361 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చినా.. సంక్షేమంతో అది కరిగిపోయింది. మొదటి ఐదు నెలల్లోనే 99 శాతం మేర రుణాలు తీసేసుకోవటంతో తదుపరి అర్ధ సంవత్సరం పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మారింది.
రాబడి 100-ఖర్చు 200
ఏపీ ప్రబుత్వం పరిస్థితి రాబడి 100, ఖర్చు 200 అన్నట్టుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర పన్నుల ద్వారా 53,159 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం చేసిన ఖర్చు 90,071 కోట్లుకు చేరుకుంది. ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం 36,912 కోట్లకు చేరింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 1,77,106 కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేశారు. అయితే.. తొలి ఐదు నెలల్లో 53 వేల కోట్ల రూపాయలు మాత్రమే రావడంతో ప్రభుత్వ ఖజనా ఇబ్బందుల్లో పడింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 15,361 కోట్ల ఆదాయం రావటం ఆర్థిక శాఖ ఇబ్బందులను కాసింత తగ్గించాయి.
కేంద్రం నుంచి రాక-పోక!
మరోవైపు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన గ్రాంట్లు 57,930 కోట్లు రావాల్సి ఉన్నా.. ఇప్పటికి వచ్చిన నిధులు కేవలం 14 వేల కోట్లు మాత్రమే. ఫలితంగా.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేస్తున్నారు. బడ్జెట్లో 84 వేల కోట్ల వరకు రెవెన్యూ వ్యయం ప్రతిపాదిస్తే.. అందులో 5,723 కోట్లను మాత్రమే పెట్టుబడి వ్యయంగా ప్రభుత్వం చూపింది. ప్రస్తుతం ఆదాయం – వ్యయం మధ్య భారీగా అంతరం ఉండటంతో దీన్ని రుణ రూపంలోనే ప్రభుత్వం భర్తీ చేసింది.
సర్వం రుణ మయం!
ఆదాయం కంటే వ్యయం 36,912 కోట్లు అధికంగా ఉండటంతో దీన్ని అప్పులు తెచ్చి పూర్తి చేశారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికిగానూ రుణ సేకరణ మొత్తాన్ని 37,029 కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే.. ఇందులో 99 శాతం మేర మొత్తాన్ని రుణంగా తీసేసుకోవటంతో మిగిలిన 6 నెలల కాలానికి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
కొవిడ్ కారణంగా ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచటంతో మరింతగా ఏపీ రుణం తీసుకుంది. ఇక, ఇప్పుడు ఈ పరిస్థితి కొనసాగేలా కనిపించడం లేదు. దీంతో ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.