ద ప్రింట్ అనే వెబ్ (ప్రముఖ అంతర్జాల మాధ్యమం) ఆంధ్రా అప్పులపై గగ్గోలు పెడుతోంది. అయినా కూడా నో ఛేంజ్. అసలు ఆ విషయమై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనే లేదని, దేశంలో చాలా రాష్ట్రాలు అప్పులు చేసే ఒడ్డున పడుతున్నాయని గతంలో ఓ సారి వైసీపీ తన ధోరణిని సమర్థించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా దానిని అంగీకరించేందుకు వైసీపీ సర్కారుకు ఎందుకనో మనసు రావడం లేదు అని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది. విమర్శ చేస్తోంది.
అయినా కూడా పరిణామాల్లో మార్పు సాధ్యం కావడం లేదు. దేశం యావత్తూ ఇలానే ఉందని, కేంద్రమే అప్పులు చేసి సంస్థలను నడుపుతున్న దుఃస్థితిలో ఉందని, అందుకే విశాఖ ఉక్కు లాంటి సంస్థలను అమ్ముకుంటోందని కొత్త లాజిక్ ఒకటి వెతికి మరీ! జనంపై రుద్దడం తగదని కూడా .. విపక్షం తన గొంతకను వినిపిస్తోంది. శ్రీలంక మాదిరిగా రాష్ట్రం దివాలా తీస్తే ఓ బెయిల్ ఔట్ పిటిషన్ దాఖలు చేయడం మినహా మిగతా అన్ని విషయాల్లోనూ తిరోగమిస్తూ అధమ స్థానంకు చేరుకుంటే అప్పుడు ఈ ప్రాంతం ఏ కావాలి అన్నది ఓ సందేహం.
జవాబుకు అందని ప్రశ్నలే ఇవాళ ఎదురవుతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేని స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కేంద్రం కూడా చేయాల్సినంత చేస్తున్నా కూడా సమస్య అయితే నివారణకు నోచుకోవడం లేదు. అపరిష్కృత రీతిలో ఉంటోంది. ఎంత చెప్పుకున్నా తక్కువే అయిన సందర్భాలు కొన్నే ఉంటాయి. ఎంత మాట్లాడినా రాయాల్సిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.
మనం రెండో కోవ అనగా.. ఆంధ్రా అన్నది ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా కూడా రాయాల్సిన పరిణామాల గురించి ఎంతో కొంత చెబుతూనే ఉంటుంది అని ! ఆ విధంగా ఆంధ్రా అన్నది ఇప్పుడొక బిగ్ టాపిక్ గా మారింది. దేశ రాజకీయాలను ఒకప్పుడు ప్రభావితం చేసిన సందర్భంను మరిచిపోయి, కేవలం అప్పులతో కుస్తీ పడుతోంది. అప్పుల్లో రాష్ట్రం ఇప్పటికే దేశంలోనే టాప్ పొజిషన్ లో ఉంది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఇంకా బాగా దూసుకుపోతున్నాం అని నివేదికలు చెబుతున్నాయి. ఇదే సందర్భంలో అధికారంలో ఉన్నవారు అంగీకరించినా, అంగీకరించకపోయినా శ్రీలంకతో ఇప్పటి పరిణామాలను పోలుస్తూ, ముందున్న కాలంలో ఏం జరుగుతుందో అని భయం చెందుతున్నారు. ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.