న్యాయమూర్తులను దూషించిన కేసులో బెయిల్ దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనబడటం లేదు. జడ్జీల పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంగా కొందరిపై కేసులు పెట్టి హైకోర్టు విచారణ చేస్తోంది.
ఈ విచారణలో ఇప్పటివరకు ఆరుగురిని సీబీఐ అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచింది. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలని పిటీషన్లు వేశారు. వీరి బెయిల్ పిటీషన్లపై విచారణ జరిపిన జడ్జి అందరి బెయిల్ పిటీషన్లను కొట్టేశారు.
జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు ఇంకా అరెస్టు కావాల్సున్నందున ఇపుడు అరెస్టయిన వారికి బెయిల్ ఇవ్వద్దన్న సీబీఐ వాదనతో జడ్జీ ఏకీభవించారు.
ఇదే విషయమై జడ్జి మాట్లాడుతు ఇపుడు అరెస్టయిన వారు చిన్న స్ధాయి వ్యక్తులే అయినా వారి వెనుక చాలా పెద్ద వ్యక్తులు ఉన్నట్లు, న్యాయవ్యవస్ధపై పెద్ద కుట్రే జరిగిందని అర్ధమవుతోందన్నారు. జడ్జీలపై చేసిన వ్యాఖ్యలన్నింటినీ న్యాయ వ్యవస్ధపై చేసినట్లుగానే పరిగణించాలని తేల్చేశారు.
న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిలో ఆరుగురిని అరెస్టు చేయటానికి ఏడాది కాలం పట్టిందంటే పిటిషనర్లు ఎంతటి శక్తిమంతులో అర్ధమైపోతోందన్నారు. మామూలు పోలీసులు నిందితులను పట్టుకోలేకపోతే సీఐడీకి బాధ్యతలు అప్పగించిన విషయాన్ని జడ్జి గుర్తుచేశారు.
సీఐడీ కూడా ఏమీ చేయలేందని తేలిన తర్వాతే కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించిన విషయాన్ని జడ్జి గుర్తుచేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టులను గమనిస్తే న్యాయవ్యవస్థపై ఎంతటి కుట్ర పన్నారో అర్ధమైపోతోందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెడుతున్నారంటే ఏమిటర్ధమంటు జడ్జి పిటిషనర్ల తరపు లాయర్లను నిలదీశారు. న్యాయమూర్తులను అపఖ్యాతి పాల్జేయటమంటే న్యాయవ్యవస్థను అవమానించటమే అని జడ్జీ స్పష్టంగా చెప్పారు.
బెయిల్ పిటీషన్ రద్దు నేపథ్యంలో జడ్జీ చేసిన వ్యాఖ్యలను చూసిన తర్వాత పిటీషనర్లకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవని అర్ధమైపోతోంది. మరి మిగిలిన వారిని సీబీఐ ఎప్పటికి అరెస్టు చేస్తుందో ? వాళ్ళ విచారణ ఎప్పుడు జరుగుతుందో ? బెయిల్ పిటీషన్లపై ఎప్పుడు విచారణ జరుగుతుందో ?