ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనే ఆసక్తి దేశమంతటా నెలకొంది.
దానికి అనేక కారణాలున్నాయి.
కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్న జగన్ ప్రభుత్వాన్ని జనం మళ్లీ గెలిపిస్తారా? లేదంటే ఓడిస్తారా అనే ఆసక్తి అందరిలో ఉంది.
నిజం చెప్పాలంటే అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే విషయంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందా అని ఇతర రాష్ట్రాలలోని పార్టీలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.
జగన్ మళ్లీ గెలిస్తే ప్రజలు ప్రత్యక్ష నగదు లబ్ధి కలిగించే సంక్షేమ పథకాలకే ఓటు వేశారన్న ఉద్దేశంతో ఇతర రాష్ట్రాలలోని పార్టీలూ ఇదే మార్గం పట్టే అవకాశాలున్నాయి.
ఒకవేళ జగన్ను కనుక జనం ఓడిస్తే అభివృద్ధి లేని సంక్షేమానికి జనామోదం ఉండదని అర్థం చేసుకుంటారు.
మరోవైపు ఏపీలోని ప్రధాన పార్టీల్లో ఒకటైన తెలుగుదేశం ఎన్డీయేలో చేరడం కూడా ఇక్కడి ఎన్నికలపై ఆసక్తికి ఒక కారణం.
400 సీట్ల లక్ష్యం పెట్టుకున్న బీజేపీకి ఏపీ నుంచి సొంతంగా ఎన్ని సీట్లు వస్తాయి.. టీడీపీ వల్ల ఎన్ని యాడ్ అవుతాయన్న ఆసక్తీ ఉంది.
ఈ అన్ని కారణాల వల్ల దేశం దృష్టి ఇప్పుడు ఏపీ ఎన్నికలపై ఉంది.
అయితే.. ఏపీలో కూటమి కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారం మాత్రం ప్రజల్లో ఏమాత్రం ఆసక్తి పెంచలేకపోతోంది.
నిజం చెప్పాలంటే వారి ప్రచారం ఇంకా ఊపందుకోలేదనే అనుకోవాలి.
చంద్రబాబు సభలు తప్ప పూర్తిస్థాయిలో కూటమి ప్రచారం కనిపించడం లేదు.
చంద్రబాబు, పవన్ కలిపి ఓసారి… చంద్రబాబు, పవన్, మోదీ కలిసి ఓసారి సభలు నిర్వహించారు.
అంతేకానీ, నియోజకవర్గ స్థాయిలో ఈ మూడు పార్టీలు కలిసికట్టుగా సాగుతున్న దృశ్యాలు అన్నిచోట్లా ఇంకా కనిపించడం లేదు.
ముఖ్యంగా టీడీపీలో టికెట్ల విషయంలో కొన్ని చోట్ల అసంతృప్తులు ఉండడం.. కొన్ని జిల్లాలలో జనసేనకు సీట్లు లేకపోవడం, జనసేన అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడం, బీజేపీ అభ్యర్థులనూ డిసైడ్ చేయకపోవడంతో చాలా నియోజకవర్గాలలో సందిగ్థం కొనసాగుతోంది.
జనసేన, బీజేపీలు కలసికట్టుగా కనిపిస్తున్నా టీడీపీ విషయానికొచ్చేసరికి ఆ రెండు పార్టీల నుంచి చాలానియోజకవర్గాలు, కొందరు నేతలలో కూటమి స్ఫూర్తి కనిపించడం లేదు.
జనసేనకు తగినన్ని సీట్లు కేటాయించలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉంది. దీంతో అలాంటి నేతల నుంచి టీడీపీ అభ్యర్థులకు ఇంకా పూర్తి స్థాయి సహకారం దొరకడం లేదు.
మరోవైపు బీజేపీలో అసలు పొత్తుల ఉత్సాహమే కనిపించడం లేదు.
ఎద్దుకు ఎండకు లాగితే ఎనుబోతు నీడకు లాగిందన్నట్లుగా ఉంది ఆ పార్టీ నేతల తీరు.
సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు వంటి నేతలు సైలెంటుగా ఉన్నారు.
జీవీఎల్ విశాఖ లోక్ సభ సీటును ఆశించినప్పటికీ అక్కడ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు.
అలాగే.. ఏపీ బీజేపీ నేతలు ఇప్పటికీ ఎలక్షన్లు ఇంకా రాలేదన్నట్లుగానే ఉన్నారు.
ఇంకా కేంద్రంలో మోదీ, అమిత్ షాల కార్యక్రమాలను, వారి పర్యటనలనే ఇంకా సోసల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కానీ ఏపీలో ఎన్నికల గురించి ఏమాత్రం ట్వీట్ చేయడం లేదు.
ఇంకా చెప్పాలంటే టీడీపీతో పొత్తులో ఉన్నా కూడా పాలక వైసీపీని పల్లెత్తి మాట అనడం లేదు, సింగిల్ విమర్శ చేయడం లేదు.
పొత్తులోని మూడు పార్టీల తీరు ఇలా ఉంటే పాలక వైసీపీ మాత్రం 175కి 175 సీట్లకూ అభ్యర్థులను ప్రకటించేసి క్షేత్ర స్థాయిలో ప్రచారం స్పీడు పెంచింది.
ఎలక్షన్లలో ఏమేం కావాలో అన్నీ రెడీ చేసుకుంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలలో వైసీపీ హోర్డింగులే కనిపిస్తున్నాయి.
టీడీపీ హోర్డింగులు అందులో సగం కూడా లేవు.
ఇక జనసేన, బీజేపీ సంగతి చెప్పనవసరం లేదు.
దీంతో ప్రచారంలో టీడీపీ వెనుకబడుతోందన్న మాట వినిపిస్తోంది.
పొత్తులో ఉన్న జనసేన, బీజేపీలకు చురుకు పుట్టించి అంతా కలిసి కట్టుగా జనం దగ్గరకు వీలైనంత వేగంగా వెళ్లాల్సిన అవసరం టీడీపీకి ఉంది.
అంతేకానీ… ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి వైసీపీ ఓటమి ఖాయమనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇలాగే కొనసాగితే టీడీపీ దెబ్బతినడం ఖాయం.
జనసేన, బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ టీడీపీ మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా ఉందన్న విషయంలో దృష్టి పెట్టి ఎలక్షన్లకు వెళ్లాల్సి ఉంది.