ఆసియా ఖండంలోనే అపర కుబేరులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. శైలా, వీరేన్ మర్చంట్ దంపతుల కుమార్తె రాధిక మర్చంట్ తో గత కొనేళ్ల నుంచి రిలేషన్ లో ఉన్న అనంత్ అంబానీ.. నేడు ఆమెతో ఏడడుగులు వేయబోతున్నాడు. వీరి వివాహానికి ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కాబోతోంది.
దాదాపు ఏడు నెలల ముందు నుంచే అనంత్-రాధిక మర్చంట్ల పెళ్లి హడావుడి ప్రారంభం అయింది. జనవరిలో నిశ్చితార్థం తర్వాత సగటున ప్రతి ఆరు వారాలకు వారి ఇంట ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంది. ఫైనల్ గా జూలై 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి పెళ్లి వేడుకలు మొదలవుతాయి. రాత్రి 9:30 గంటలకు వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు సాగే అనంత్-రాధిక మర్చంట్ల పెళ్లి వేడుకల్లో ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, క్రీడా, సినీ, విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేయబోతున్నారు.
మరోవైపు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ రాయల్ వెడ్డింగ్ బడ్జెట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఊహించనంత ఎక్స్‌పెన్సివ్‌గా ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహాన్ని జరిపిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం.. అనంత్ అంబానీ వివాహ మహోత్సవం ఖర్చు రూ. 4,000-5,000 కోట్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇది అంబానీ కుటుంబ నికర విలువలో కేవలం 0.5 శాతమే అయినప్పటికీ.. మిగతా వారికి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ.
ఇక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసమే దాదాపుగా రూ. 1,500 కోట్లు ఖర్చు చేశారట. ఇది కాకుండా జూలై 12 నుంచి జూలై 15 వరకు జరగబోయే పెళ్లి వేడుక కోసం రూ. 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అలాగే అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల వివాహానికి 2500 మందికి పైగా ముఖ్యమైన అతిథులను ఆహ్వానించారు. ఇందుకోసం వారికి పంపిన ఒక్కో ఇన్విటేషన్ కార్డ్ ఖరీదు రూ.7 లక్షలు ఉంటుందని అంటున్నారు. మరోవైపు తన కుమారుడి వివాహ వేడుకకు వచ్చే అతిథుల కోసం ముకేష్ అంబానీ.. ఏకంగా మూడు ఫాల్కన్ 2000 జెట్లు, 100కు పైగా ప్రైవేట్ విమానాలను రెంట్ కు తీసుకుని ఉపయోగిస్తున్నారు.