కరోనా వల్ల జనం బయట తినడం మానేశారు. లాక్ డౌన్ ఎత్తేసినా కూడా బయట తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు … అని చాలా మంది భ్రమపడ్డారు. కానీ జనం ఏమీ మారలేదు. వారి ఆహార అలవాట్లు పెద్దగా మారలేదు. బయటి ఫుడ్ పై అదే ప్రేమ, తాపత్రయం చూపిస్తున్నారు.
తాజాగా బెంగుళూరులో కనిపించిన ఒక దృశ్యం బాగా వైరల్ అవుతోంది. ఒకవైపు కరోనా వల్ల పలు రెస్టారెంట్లు మూత పడిన మాట నిజమే కానీ రుచిలో ప్రజల మనసు దోచుకున్న వాటికి మాత్రం ప్రజల నుంచి ఆదరణ ఉంది. బెంగళూరు ప్రాంతంలోని హోస్కోట్లోని ప్రసిద్ధ ఆనంద్ దమ్ బిర్యానీ కోసం జనం ఎట్లా ఎగబడ్డారంటే… అసలు కరోనా అనే ఒక సమస్య ఉందా అనిపించేలా ఉంది.
ఆ రెస్టారెంట్ వెలుపల కిలోమీటరు పొడవైన క్యూలో వేలాది మంది కస్టమర్లు బిర్యానీ కొనడం కోసం గంటల తరబడి నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంత బిర్యానీ తినాలని ఉంటే మాత్రం మరీ ఇంత సేపు, అంత క్యూలో నిలబడి తీసుకోవడం ఏంటి?
ఈ వీడియోను ట్విట్టర్లో @ikaveri అనే నెటిజన్ షేర్ చేశారు. “ఏం బిర్యానీ ఇది ? అంతపెద్ద క్యూలో ఉన్నారు. ఫ్రీగా ఇస్తున్నారా ఏంటి?‘‘ అంటూ కామెంట్ పెట్టారు. ఇంతవరకు మద్యం కోసం క్యూలో ఉన్నది మాత్రమే చూశాం. కానీ బిర్యానీ కూడా పాండెమిక్ సమయంలో ఇంత పెద్ద క్యూ ఉండటం ఒక విచిత్రమే. ఆదివారం కోవడం, ఈ బిర్యానీ బాగా పాపులర్ కావడంతో జనం దీని కోసం ఎగబడ్డారు.”బిర్యానీ లేకుండా జీవించడం కంటే బిర్యానీతో మరణించడం మంచిది.” అంటూ ఒక నెటిజన్ దీనికి కామెంట్ పెట్టారు.
కొసమెరుపు ఏంటంటే… ఆ హోటల్ లిమిటెడ్ గా అమ్ముతుందట. క్యూలో వారందరికీ బిర్యానీ దొరక్కపోవచ్చట. ఆదివారం కావడంతో ఇంత పెద్ద క్యూ ఉందని యజమాని అన్నారు. ఈ ఆనంద్ బిర్యానీ బెంగళూరు నగర కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉంటుంది.