వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు.
సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు ఆనం. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారన్నారు.
అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామని చెబుతున్నారని.. అవి పూర్తయ్యే లోపు తమ పదవి కాలం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఆనం.. గత కొద్దిరోజులుగా ఇలాగే సొంత పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన మరోనేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా సొంత పార్టీపై నిరసన వ్యక్తంచేస్తుండగా సీఎం జగన్ తాజాగా ఆయన్ను పిలిచి మాట్లాడారు.
కానీ, ఆనంను మాత్రం నిర్లక్ష్యం చేస్తూ బుజ్జగించే ప్రయత్నాలేమీ చేయలేదు. దీంతో ఆనం మరింత ఆగ్రహంగా ఉన్నారని… జగన్ తీరుపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు.
ముందస్తు ఎన్నికలు వచ్చినా.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా కూడా ఆనం మాత్రం వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదని తెలుస్తోంది. ప్రధానంగా ఆనం ఈసారి తనతో పాటు తన కుమార్తెకు కూడా టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని.. తన కుమార్తె కైవల్య ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది.
కైవల్య భర్త రితీష్ రెడ్డి కడప జిల్లా బద్వేలులో టీడీపీ కీలక నేత. ఆ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా ఆయనే ఉన్నారు. బద్వేలు జనరల్ నియోజకవర్గంగా ఉన్నకాలంలో రితీశ్ రెడ్డి తండ్రి బిజివేముల వీరారెడ్డి అయిదు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారిన తరువాత వీరారెడ్డి పోటీకి అవకాశం లేకపోయింది. 2014 నుంచి వైసీపీ నేతలు ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు.
రితీశ్ రెడ్డికి వేరే స్థానం నుంచి టికెట్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆయన భార్య కైవల్యకు(ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె) నెల్లూరు జిల్లా ఆత్మకూరు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ ఆసక్తిగానే ఉన్నట్లు చెప్తున్నారు.
అదే జరిగితే తండ్రీకూతుళ్లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.