నిన్న మొన్నటి వరకు మేడం.. మేడం.. అని పిలిపించుకున్న ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారిణి.. ఇక, `సార్` అయింది. ఇక, నుంచి ఆమెను.. అతడిగా.. `సార్.. సార్` అంటూ పిలవాల్సిందే. ఎందుకంటే.. దేశంలోనే తొలిసారి ఒక అఖిల భారత సర్వీసు అధికారిణి.. లింగ మార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. చిత్రం ఏంటంటే.. లింగ మార్పిడి వ్యవహారం కేంద్రానికి, కోర్టులకు కూడా తెలుసు. దీనికి సంబంధించి ప్రాసెస్ గత రెండేళ్లుగా జరిగి.. తాజాగా విజయవంతమైంది. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లింగ మార్పిడి ఆపరేషన్ పూర్తయి.. ఆమె-అతడుగా మారిపోయి.. `సార్` అయింది!!
ఎవరు? ఏంటి కథ?
భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఓ లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్ తన జెండర్ను మార్చుకుని లేడీ నుంచి పురుషుడిగా మారాడు. తన జెండర్ తో పాటు పేరును కూడా మార్చాలని ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన `అనసూయ` కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. కాగా, కేంద్రం రూల్స్ ను క్షుణ్నంగా పరిశీలించి `అతని జెండర్ `తో పాటు పేరును `అను కతిర్ సూర్య`గా మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సివిల్ సర్వీసెస్ చరిత్రలో అధికారికంగా జెండర్ మార్చుకున్న అధికారిగా అను కతిర్ సూర్య రికార్డు సృష్టించారు.
ఇంతకీ ఈ అధికారి ఎక్కడో పనిచేయడం లేదు.. మన హైదరాబాద్లోనే. అను కతిర్ సూర్యగా మారిన అనసూయ.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్లో జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనసూయ అవివాహిత అని సమాచారం. ఇలాంటి ఘటనలపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించగా జెండర్ ఐడెంటిటీ అనేది వారి వారి వ్యక్తిగతం అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. లింగ మార్పిడి కోరుకున్న వ్యక్తికి ఎలాంటి ప్రతిబంధకాలూ ఉండరాదని కూడా కోర్టు తేల్చి చెప్పింది.
దీంతో అనసూయ.. అనుకతిర్ సూర్యగా మారడం సులభమైంది. కాగా, చెన్నైకి చెందిన అనసూయ.. (అను కతిర్ సూర్య) మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లో పట్టా పొందారు. చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న సమయంలో 2018లోనే హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయి.. ఇక్కడే పనిచేస్తున్నారు.