ఏపీ సీఎం జగన్ 15నెలల పాలనలో రాష్ట్రాంలో హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని, మత మార్పిడులు, అన్యమత ప్రచారం పెరిగిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంలో విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకుందని విమర్శలు వచ్చాయి.
ఇక, తిరుమల వెంకన్న ఆలయానికి చెందిన 12 వేల కోట్ల డిపాజిట్లను ప్రభుత్వం తమకు అప్పుగా ఇవ్వాల్సిందిగా కోరిందని, అందుకు టీటీడీ మాజీ ఈవో అనిల్ సింఘాల్ ససేమిరా అనడంతోనే ఆయనపై బదిలీ వేటు పడిందని పుకార్లు వస్తున్నాయి. ఇక, అంతర్వేది ఘటన, తిరుమల డిక్లరేషన్ వ్యవహారం జాతీయస్థాయిలో చర్చనీయాంశాలయిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిలో గోప్యంగా సాగిన వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అమరావతిలో పెద్ద సంఖ్యలో క్రిష్టియన్ మిషనరీల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో వైసీపీ సర్కార్ ఉందని, అందులో భాగంగానే విజయమ్మ అమరావతిలోని సైలెంట్ గా పర్యటించారని వదంతులు వినిపిస్తున్నాయి.
తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి కారులో బయలు దేరిన విజయమ్మకు ఒక ఎస్కార్ట్ వాహనం మాత్రమే వెంట వచ్చిందని తెలుస్తోంది. సచివాలయం ప్రహరీ గోడకు, పార్కింగ్ ప్రదేశానికి మధ్య ఉన్న రహదారి మీదుగా.. కారులోంచే సచివాలయాన్నీ, అసెంబ్లీ భవనాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ విజయమ్మ ముందుకు వెళ్లారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించిన భవనాలు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల నిర్మాణానికి పునాదులు వేసిన ప్రాంతాన్ని విజయమ్మ కారులో నుంచి పరిశీలించారని తెలుస్తోంది. హైకోర్టు వరకు వెళ్లిన విజయమ్మ ఆ తర్వాత నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారని, ఈ పర్యటనపై సీఆర్డీఏ అధికారులకూ సమాచారం లేదని తెలుస్తోంది.
మామూలుగా అయితే విజయమ్మ పర్యటన ఇంత సాదాసీదాగా ఉండదని, ఇంత గోప్యంగా విజయమ్మ పర్యటన సాగడం వెనుక వేరే కారణం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అమరావతిని వాటికన్ సిటీ తరహాలో చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, క్రిష్టియన్ మిషనరీలకు వందల ఎకరాల భూములను చౌకగా అమ్మేందుకు సిధ్ధమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనికితోడు విశాఖకు రాజధాని తరలివెళితే అమరావతిలో ఖాళీ అయ్యే భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా క్రిష్టియన్ మిషనరీలకు కట్టబెట్టేందుకు సర్కార్ యోచిస్తోందని పుకార్లు వస్తున్నాయి. క్రిష్టియన్ మిషనరీల ఎజెండా ప్రకారమే విజయమ్మ అమరావతిలో గోప్యంగా పర్యటించారని నెటిజన్లు అనుకుంటున్నారు. మరి, ఈ పుకార్లలో వాస్తవమెంత..అన్నది తేలాల్సి ఉంది.