ఆరు కోట్ల ఆంధ్రుల కేరాఫ్‌గా అమరావతి నిలవడమే కాకుండా.. ప్రచంపస్థాయి నగరంగా పరిఢవిల్లాలనే కాంక్షతో రైతుల త్యాగాలకు ప్రతీకగా నిలిచిన రాజధాని అమరావతిని నిలుపుకొనేందుకు ఇక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రవాసాంధ్రులు దన్నుగా నిలిచారు. రాష్ట్ర సర్కారు మిడిమిడి జ్ఞానంతో నవ్యాంధ్రకు మణిహారమైన రాజధాని నగరంగా భాసిల్లాల్సిన అమరావతిని మొగ్గలోనే చిదిమేసి.. మూడు రాజధానుల పేరుతో మతిలేని ఆలోచనను తెరమీదికి తేవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ.. రైతులు చేస్తున్న ఉద్యమానికి ఎన్నారైలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు ఆ ప్రాంత రైతాంగం చేస్తున్న భారీ ఉద్యమానికి ఎన్నారైలు ఆది నుంచి అండదండలు అందిస్తున్నారు. ఆరు కోట్ల ఆంధ్రులారా… అరక దున్ను అమరావతి రైతులారా.. అమరావతి బిడ్డలారా.. దగాపడ్డ తమ్ములారా.. రగులుతున్న మహిళల్లారా.. బాధపడకండి.. వస్తున్నాం మీకోసం..చట్టానికి కళ్లుపీకి ధర్మానికి నోరునొక్కి సాగుతున్న దుర్మార్గం సాగదు ఇంకా ఎంతోకాలం! మీరు చేస్తున్న పోరాటాలకు మేము మీకు అండగా ఉంటాం అంటూ నిత్యం నినదిస్తూనే ఉన్నారు.
భారత కాలమానం ప్రకారం శని వారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో తొలి ప్రసంగం “జయరాం కోమటి” చేయగా, డాక్టర్ శ్రీనివాసరావు కొడాలి తో సహా అమరావతి రైతు, దళిత మరియు ఇతర జేఏసీ నాయకులు ప్రసంగించారు.
రాజధాని ఉద్యమంలో ఆది నుంచి ఉత్తేజపూరితమైన సంకల్పంతో పాల్గొంటూ, పోలీసు లాఠీలకు సైతం ఎదురొడ్డి నిలిచిన ఉక్కు మహిళలు శ్రీమతి శ్రీలక్ష్మి, మరియు కుక్కుమళ్ల పిచ్చమ్మ లు తమ స్వహస్తాలతో ఘనంగా nrisforamaravati.orgప్రారంభించారు.
అదేవిధంగా ఉద్యమంలో ఆది నుంచి కీలక పాత్ర పోషిస్తున్న మహిళా రైతులు, మహిళలు, యువతులు కూడా తమ అనుభవాలను, ఉద్యమాన్ని మరింత తీవ్రంగా తీసుకువెళ్లేందుకు వేసుకున్న ప్రణాళికలను వివరించారు.
రాజధాని అమరావతిని కాపాడుకోవాలనే సంకల్పంలో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చందు గొర్రపాటి, సతీశ్ వేమన, రత్న ప్రసాద్, టాగూర్, సాయి, రాజా, ప్రసాద్, చందు, నాగ, శ్రీనివాస్ తో సహా అనేక మంది తమ విలువైన సమయాన్ని వెచ్చించారు.
కాగా, వెబ్సైట్ ప్రారంభోత్స కార్యక్రమంలోబుచ్చి రామ్ ప్రసాద్, కృష్ణా గంపా, ప్యాలా ప్రసాద్, రజనీకాంత్, శ్రీమంత్, శివశంకర్, గంగాధర్, శ్రీనివాస్ గుత్తికొండ, మోహన్‌కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, కిశోర్ కంచెర్ల, సంపత్ కామినేని, శ్యాం మద్దాలి, విజయ్ శేఖర్ అన్నే, డాక్టర్ మధు కొర్రపాటి, డాక్టర్ రవీంద్ర ఆలపాటి, శ్రీనివాస మంచికలపూడి, ప్రసాద్ చుక్కపల్లి, అంజయ్య చౌదరి లావు, డాక్టర్ అప్పారావు ముక్కాముల, ప్రశాంత్ పిన్నమనేని, గంగాధర్ నాదెళ్ల, రవి మండలాపు, సురేష్ పుట్టగుంట, శతీష్ వేమూరి, చుక్కపల్లి ప్రసాద్, మురళి వెన్నం, చలపతి కొండ్రగుంట, శ్రీనివాస లావు, సత్యనారాయణ వాసిరెడ్డి పాల్గొని అమరావతి ఉద్యమంలో తాము కూడా కీలక పాత్ర పోషిస్తామని ప్రతిజ్క్ష చేశారు.
కాగా, ఈ కార్యక్రమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున జయరాం కోమటి ధన్యవాదాలు తెలిపారు.