గత ఏడాది సలార్ మూవీతో సూపర్ హిట్ ను అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్త దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు.
రెండు భాగాలుగా కల్కి మూవీ రాబోతోంది. పార్ట్ 1ను ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదల చేయబోతున్నారు. కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య ఈ సినిమా సాగుతుందని నాగ్ అశ్విన్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఏర్పడ్డాయి. ప్రచార కార్యక్రమాలతో సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు. అందులో భాగంగానే బుధవారం ముంబైలో కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. రానా దగ్గుబాటి హోస్ట్ గా చేసిన ఈ ఈవెంట్ కు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అలాగే నిర్మాత అశ్వినీ దత్, ఆయన కుమార్తెలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ కూడా హాజరయ్యారు. ఎంతో సరదాగా సందడిగా ఈవెంట్ సాగింది. దీపిక ప్రెగ్నెంట్ కావడంతో కో స్టార్స్ ఆమెకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. అలాగే ప్రభాస్ చాలా తక్కువగా మాట్లాడటంతో అమితాబ్, రానా, దీపికా అతనిపై సెటైర్లు పేల్చి నవ్వించారు. ఇక ఇదే ఈవెంట్ కల్కి మూవీ ఫస్ట్ టికెట్ ను అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేశారు. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కు రూ. 500 ఇచ్చి టికెట్ ను కొన్నారు.
అలాగే ఆ టికెట్ ను కమల్ హాసన్ కు గిఫ్ట్ గా బిగ్‌బీ ప్రజెంట్ చేశారు. కల్కి ఫస్ట్ టికెట్‌ను అమితాబ్ నుంచి అందుకోవడంతో కమల్ హాసన్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. బిగ్‌బీ నటించిన షోలే మూవీ టికెట్ కోసం కొన్ని వారాల పాటు ఎదురుచూసిన సంగతులను కమల్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.