తమిళ నాడులోని బీజేపీ నేతల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు ఏపీ వరకు వచ్చాయి. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడుపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే.. ఈ దఫా కూడా పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఒక్క సీటు కూడా బీజేపీ దక్కించుకోలేక పోయింది. అయితే.. దీనికి కారణాలు వెతికే పనిలో పడిన తమిళనాడు నాయకులు.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైని టార్గెట్ చేశారు. ఆయన వల్లే పార్టీ ఓడిందన్న కామెంట్లు కూడా తెరమీదికి వచ్చాయి.
అయితే.. అన్నామలైని పట్టుబట్టి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీకి ఈ పరిణామం మింగుడు పడలేదు. దీంతో ఆయనపై ఫైర్ అవుతున్న వారి విషయంలో కేంద్ర పెద్దలు సీరియస్‌గానే ఉన్నారని రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ విజయం సాధించలేకపోయినా భవిష్యత్‌లో ఉనికి నిలుపుకునేందుకు అన్నామలై బాగానే పనిచేశారని భావిస్తున్నారు. ఓటు శాతం పెంచుకోవడంలో కీలక పాత్ర పోషించిన స్టేట్ చీఫ్ అన్నామలైకి కేంద్ర పెద్దలు అండగా ఉన్నారు.
ఈ క్రమంలో అన్నామలైని టార్గెట్ చేసి.. కామెంట్లు కురిపించిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై విషయంలో తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫైరయ్యారు. అన్నామలైకి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండడం తమిళిసైకి నచ్చడం లేదన్న విషయం కూడా వస్తోంది. దీంతో సోషల్ మీడియాలోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇలా అంతర్గత విభేదాలు బయటకు పొక్కడంపై హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తాజా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి తమిళిసై కూడా వచ్చారు. ఆమెను చూసిన అమిత్‌షా అక్కడే పిలిచి మరీ మందలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నామలైపై విమర్శలు చేయడంపై ఆమెని మందలించినట్టు తెలుస్తోంది. వేలు పెట్టి మరీ.. “మీరు అలా చేయొద్దు“ అని గట్టిగానే ఆమెకు చెప్పినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలు ఏపీ వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఈ పరిణామం ఇక్కడితో ఆగుతుందా? లేక.. మరేదైనా యూటర్న్ తీసుకుంటుందా? అనేది చూడాలి.