ముందస్తుగా ఎలాంటి ప్రకటనలు లేకుండా.. కేవలం ఒకట్రెండు రోజుల ముందు హడావుడిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. తనతో పాటు నేతల్ని.. లాయర్లను వెంట పెట్టుకొని హస్తినకు వెళ్లిన ఆయన.. తొలి రోజున కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాత్రి వేళలో కలిసిన జగన్ తో ముప్పావు గంటకు పైనే మాట్లాడారు.
ముందుగా అనుకున్న షెడ్యూల్ టైం దాటినా మాట్లాడిన షా.. తాము చర్చించాల్సిన అంశాలపై బుధవారం మాట్లాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండో రోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి షాతో భేటీ అయ్యారు. అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ..కేవలం పావు గంటకే జగన్ బయటకు రావటం ఆసక్తికరంగా మారింది.
రెండో రోజు ఉదయం పది గంటల సమయంలో అమిత్ షాతో భేటీ అయిన జగన్.. కేవలం పావు గంటకే బయటకు రావటం.. ఈసారి ఆయన మూడ్ సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. జగన్ తో భేటీకి ముందు అమిత్ షా పలువురు న్యాయ నిపుణులతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలు.. న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న వైనంపై సొలిటర్ జనరల్ తుఫార్ మెహతాతో పాటు పలువురు న్యాయ నిపుణులతో షా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువసేపు భేటీ సాగలేదని చెబుతున్నారు.
జగన్ కోరినట్లుగా కొన్ని అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశించలేమని చెప్పినట్లుగా సమాచారం. దీంతో.. భేటీ త్వరగా ముగిసేలా చేసిందని తెలుస్తోంది.