ఏపీలో వైసీపీపై రాష్ట్ర బీజేపీ నేతల మెతక వైఖరిపై కొంతకాలంగా బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు థూథూ మంత్రంగా విమర్శలు చేయడం వంటివి బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్ షా.. సోము వీర్రాజుకు క్లాస్ పీకారట. వైసీపీ ప్రభావం నుంచి బయటకు రావాలని సోము వీర్రాజును షా మందలించారట.
పార్టీ పొత్తుల గురించి హై కమాండ్ నిర్ణయిస్తుందని, మీరు ఎందుకు మాట్లాడుతున్నారని సుజనా చౌదరి, సీఎం రమేష్ లను షా నిలదీశారట. అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు వెళ్లలేదని బీజేపీ నేతలను అమిత్ షా నిలదీశారట. ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా పార్టీ తీర్మానం చేసిన తర్వాత పాదయాత్రకు మద్దతివ్వాలని షా ప్రశ్నించారట. పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలను రాష్ట్ర నాయకులు వివరణ అడగడంపై షా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
పాదయాత్రలో ఒక సామాజిక వర్గం పాల్గొంటుందని కొంతమంది బీజేపీ నేతలు చెప్పడంతో షా ఆగ్రహం వ్యక్తం చేశారట. బీజేపీ తరపున రైతుల మహాపాదయాత్రలో పాల్గొనాలని రాష్ట్ర నేతలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారట. కేంద్రంలోని పెద్దల పేర్లు చెప్పి రాష్ట్రంలో పెత్తనాలు చేయవద్దని కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారట. వైసీపీపై ఉన్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలచుకోవడంలో విఫలమవుతున్నామని, దానిపై ఫోకస్ పెట్టాలని షా ఆగ్రహం వ్యక్తం చేశారట.
ఏపీ బీజేపీ నేతల్లో అభిప్రాయ బేధాలున్నాయని షా వ్యాఖ్యానించారని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం, వారిని గౌరవించడం నేర్చుకోవాలని నేతలకు షా దిశానిర్దేశం చేశారట. వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఏపీలో ఎదగాలని షా సూచించారట. ఎవరి మీదనో ఆధారపడవద్దని, అందరూ పార్టీ కోసం పని చేయాలని పవన్ ను ఉద్దేశించి షా వ్యాఖ్యానించారని తెలుస్తోంది.